

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 24 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం పట్టణం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని ఒక అపార్టుమెంటులో ఒకమ్మాయి ఆత్మహత్యకు
ప్రయత్నిస్తున్నట్లుగా డయల్ 112కు వచ్చిన ఫిర్యాదుపై, విజయనగరం 2వ పట్టణ కానిస్టేబులు సకాలంలో స్పందించి, 17సం.ల బాలికను రక్షించిన కానిస్టేబులు ఆర్.జగదీష్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఏప్రిల్ 23న జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించి, ప్రశంసా పత్రం అందజేసారు. వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణం వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న 17సం.ల ఒకమ్మాయి ఇంటిలో తలుపులు వేసుకొని, ఆత్మహత్యాయత్నంకు పాల్పడుతున్నట్లుగా డయల్ 112కు ఫిర్యాదు రాగా, సదరు విషయాన్ని కంట్రోల్ రూం పోలీసులుకు సమాచారం అందించగా, విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనులో
కానిస్టేబులుగా పని చేస్తున్న ఆర్.జగదీష్ ను సంబంధిత అధికారులు పంపారన్నారు. కానిస్టేబులు ఆర్.జగదీష్ సకాలంలో స్పందించి, సంఘటనా స్థలంకు చేరుకోగా, అప్పటికే సదరు అమ్మాయి ఒక గదిలోకి వెళ్లి, తలుపు వేసుకొని, ఆత్మహత్యాయత్నంకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారన్నారు. కానిస్టేబులు ఆర్.జగదీష్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, గది తలుపులు పగులుగొట్టి, లోపలకు ప్రవేశించి, ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అమ్మాయిని, స్థానికుల సహకారంతో ఆమెను క్రిందకు దించారన్నారు. విచారణలో అమ్మాయి చదవును నిర్లక్ష్యం చేయడం, స్నేహితులతో తరుచూ ఎక్కువ సమయం గడుపుతున్నందున తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యకు యత్నించినట్లుగా గుర్తించి, సదరు ఆమ్మాయికి 2వ పట్టణ పోలీసులు కౌన్సిలింగు నిర్వహించారన్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
సకాలంలో స్పందించి, ఆత్మహత్యయత్నం నుండి బాలికను రక్షించిన కానిస్టేబులు ఆర్.జగదీష్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, సంఘటన జరిగిన తీరును, ఆమెను రక్షించేందుకు తీసుకున్న చర్యలను కానిస్టేబులు జగదీష్ ను అడిగి తెలుసుకొని, ప్రశంసా పత్రం ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.