

జనం న్యూస్:24 ఏప్రిల్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి :
వై. రమేష్:ఇంటర్మీడియట్ లో తెలుగు భాష స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మానుకోవాలని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐతా చంద్రయ్య అన్నారు. గురువారం సాయంత్రం సిద్దిపేట శాఖా గ్రంధాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పరిపాలన బాషగా ప్రతి కార్యాలయం తెలుగు భాషా ద్వారానే కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. అధికార భాష హోదా దక్కిన తెలుగును కళాశాల విద్యలో తొలగించడం ఎంతవరకు సబబు అని అన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి మాట్లాడుతూ తెలుగుభాష ఉన్నంతకాలమే మనకు గౌరవం దక్కుతుందని, ఇతర భాష వల్ల వెనుకబడి పోతున్నామన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ మార్కుల కొరకు నేడు సంస్కృతం ఇంటర్మీడియట్లో విద్యార్థులకు అనువుగా మారిందని, అందువల్ల తెలుగు భాషకు ముప్పు కలుగుతుందని, తెలుగు భాష గౌరవం దక్కాలంటే ఇంటర్మీడియట్లో ప్రతి ఒక్కరు తెలుగు చదివేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కూడా ఇట్టి విషయాన్ని ఎన్నోసార్లు ప్రస్తావించామన్నారు. తెలుగు భాష మూలంగానే అన్య భాషలకు గౌరవం దక్కుతుందన్నాడు. కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి బస్వ రాజు కుమార్, చీకోటి రాములు, వంగరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.