

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 25 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణం పోలీసు లైన్స్ లో నడపబడుతున్న పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫైనల్ పరీక్షల్లో 100శాతం ఉత్తమ ఫలితాలు సాధించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఏప్రిల్ 24న తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించినందుకు వేడుకగా జిల్లా ఎస్పీ పోలీసు కార్యాలయంలో విద్యార్థులతో కేక్ కట్ చేయించి, విద్యార్ధులకు తినిపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – నామమాత్రపు ఫీజులతో పోలీసు సంక్షేమ ఆంగ్లపాఠశాలలో ఇతర కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం పోలీసు స్కూలు నుండి ప్రప్రధమంగా 13మంది విద్యార్థులు 10వ తరగతి తుది పరీక్షలకు హాజరుకాగా, 100శాతం ఉత్తమ ఫలితాలతో 13మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇదే రకమైన ఫలితాలను పోలీసు స్కూలు విద్యార్థులు భవిష్యత్తులో కూడా సాధించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. ఉత్తమ ఫలితాలు సాధించుటలో పాఠశాలఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల మంచి శ్రద్ధ కనబర్చారని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా స్టడీ అవర్స్ నిర్వహించా రన్నారు. విద్యార్థుల విజయం ఇక్కడితో ఆగిపోకూడదని, విజయ పరంపర ఇక్కడ నుండే ప్రారంభం కావాలన్నారు.పోలీసు వెల్ఫేర్ స్కూలును ఇంకా అభివృద్ధి చేసేందుకు అవసరమైన బిల్డింగ్సు, టీచింగు, మెథడాలజీ, మెటిలియల్ వంటి ప్రణాళికలు, ప్రతిపాదనలను తీసుకొని వస్తే, వాటిని పాఠశాలలో అందుబాటులోకి తీసుకొని వచ్చి, భవిష్యత్తులో జిల్లా లోనే క్రమశిక్షణ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న పాఠశాలగా తీర్చిదిద్దుతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్య మాట్లాడుతూ – తమ స్కూలు పిల్లలు డైమండ్స్ గా మార్చడంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించారని, వారికి సబ్జెక్ట్స్ పరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎప్పటి కప్పుడు వాటిని నివృత్తి చేసామన్నారు. గత కొన్ని మాసాలుగా ఉపాధ్యాయులు పడిన శ్రమ మంచి
ఫలితాలు ఇచ్చిందని, తమను ఎంతగానో ప్రోత్సహిస్తున్న జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాల ఇన్చార్జ్ ఆర్ఎస్ఐ ఎన్.గోపాల నాయుడు మాట్లాడుతూ – 10వ తరగతి ఫైనల్ పరీక్షలకు హాజరైన తొలి ప్రయత్నంలోనే 100శాతం ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. 13మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 11మంది 500మార్కులు పైగా సాధించడం, మిగిలిన ఇద్దరూ 490 మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. 581 మార్కులతో స్కూలు ఫస్ట్ గా నిలిచిన ఎస్. వైష్ణవి, 575 మార్కులతో స్కూలు సెకండ్ గా నిలిచిన సిహెచ్.హర్ష వర్ధన్, 562 మార్కులతో స్కూలు థర్డ్ నిలిచిన జి.లవీంద్రులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు. స్కూలు ఉపాధ్యాయులు, హెచ్. ఎం.సంధ్య మరియు ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించి, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పని చేసి, ఉత్తమ ఫలితాలు రాబట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, అదనపు ఎస్పీ (ఎఆర్) జి.నాగేశ్వరరావు,ఆర్ ఐలు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.శ్రీనివాసరావు, హెచ్.ఎం.సంధ్య, స్కూలు ఇన్చార్జ్ ఆర్ఎస్ఐ వరప్రసాద్ మరియు ఇతర పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.