Listen to this article

▪చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలి..

▪ప్రభుత్వ ఔషధాలను అర్హులకు అందించాలి..

శుక్రవారం సభలో కలెక్టర్ పమేలా సత్పతి..

జనం న్యూస్ // ఏప్రిల్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటే రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం ఇల్లందకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభలో కలెక్టర్ మాట్లాడారు. రూ.40 వేల విలువైన 54 రకాల వైద్య పరీక్షలను ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద ఉచితంగా అందిస్తున్నామని మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని.. ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్, ట్యూమర్ వంటి ప్రమాదకర వ్యాధులను సకాలంలో గుర్తించి చికిత్స పొందితే నయం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు వైద్య సహాయం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పొందవచ్చన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని చిన్నారులను కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఇల్లందకుంటలో ఏడుగురు చిన్నారులు తక్కువ ఎత్తుతో, 9 మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తెలిపారు. అబా కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు కంటే నాణ్యమైన ఔషధాలను ప్రభుత్వం సరఫరా చేస్తుందని.. వీటిని అర్హులకు చేరవేయాలని వైద్య సిబ్బందిని, ఆశ వర్కర్లను ఆదేశించారు.ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు చేశారు. వైద్య శిబిరం వద్దకు వెళ్లి కలెక్టర్ పలు వివరాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, పర్వీన్, తహసీల్దార్ రాణి , అధికారులు తదితరులు ఉన్నారు.