Listen to this article

ఇంటి నిర్మాణ ప్రతి దశలో ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది

ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల

4 విడత లలో ఇందిరమ్మ ఇండ్లకు నిధుల విడుదల

కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జనం న్యూస్ , ఏప్రిల్ 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో అత్యంత నిరుపేదలను ఎంపిక చేసి ఇండ్లు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నమూనాను మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మించామని, మొదటి విడతలో ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం గురించి అవసరమైన సలహాలు మరియు మేస్త్రి లకు జిల్లా లోని నాక్ సెంటర్ ద్వారా పూర్తి స్థాయిలో శిక్షణ అందిస్తున్నామని అన్నారు.ఇందిరమ్మ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాలకు మొదటి విడతలు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల సంఖ్య ఆధారంగా తుది లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదంతో ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.మొదటి విడతలో సోంత జాగా ఉండి సొంత ఇల్లు లేని అత్యంత నిరుపేదలకు, కుటుంబానికి ఒక ఇల్లు మాత్రమే మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇంటి నిర్మాణంలో కూడా ప్రతి దశలో లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక , ఇతర సామాగ్రి ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండలాలో ఎంపిక చేసిన పైలట్ గ్రామాలలో గ్రౌండింగ్ పూర్తి చేసి బేస్మెంట్ వరకు నిర్మించిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిందని అన్నారు. ఇప్పటి వరకు పెద్దపల్లి జిల్లాలో 168 లబ్ధి దారులు బేసిమెంట్ నిర్మాణం చేసిన లబ్ధి దారులను ప్రతిపాదించగా ప్రభుత్వం నుండి 100 మంది లబ్ధి దారులకు ఒక్కరికీ 1 లక్ష రూపాయల చొప్పున జిల్లాకు 1 కోటి రూపాయలు విడుదల అయ్యాయని, మిగతా లబ్ధి దారులు పనులు ప్రారంభించాలని తెలిపారు.ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రజలు ప్రభుత్వం అందించే 5 లక్షల రూపాయలలో నాణ్యమైన ఇంటి నిర్మాణం చేసుకోవాలని, పేదలు ఇంటి నిర్మాణాన్ని కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ,10 సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలో ప్రజలు పడిన ఇబ్బందులు గమనించి ప్రజా ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్ల అందించాలని లక్ష్యంతో 4 లక్షల 50 వేల ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని , ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామని అన్నారు.ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని అన్నారు. గతంలో 2004 నుంచి 2014 మధ్యలో సుమారు 23 లక్షల ఇందిరమ్మ ఇండ్ల కట్టించామని .ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇంటి నిర్మాణానికి ఎటువంటి నిబంధనలు లేవని, 400 చదరపు అడుగులు తగ్గకుండా స్థలంలో ఒక బాత్ రూమ్, ఒక కిచెన్ ఉండేలా నిర్మాణం చేసుకోవాలని తెలిపారు.పేదలకు 4 విడత లలో ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయం అందుదని, ఫౌండేషన్ వేసిన తర్వాత లక్ష రూపాయలు, కిటికిలు వేసిన తర్వాత లక్ష పాతిక వేలు, స్లాబ్ దశ చేరిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు , ఇండ్లు పూర్తి చేసిన తర్వాత మరో లక్ష రూపాయల మొత్తం ఐదు లక్షల సహాయం పేదలకు ఇంటి కోసం అందుతుందని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్న గ్రీన్ ఛానల్ లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే సారి 20 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని అన్నారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచితంగా బస్సులలో ప్రయాణం వంటి పథకాలను అమలు చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు.నిరుద్యోగ యువతకు దేశంలో ఎక్కడా లేనివిధంగా మొదటి సంవత్సరంలోనే 56 వేల ఉద్యోగాలను కల్పించామని అన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను సైతం పూర్తి చేసి పేదలకు అందిస్తున్నామని తెలిపారు.గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు డైట్ చార్జీలు,
కాస్మోటిక్ చార్జీలు భారీగా పెంచామని అన్నారు. గతంలో ప్రభుత్వాలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, పేదల అభివృద్ధికి కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి.గంగయ్య,ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ రాజేశ్వర్, తహసీల్దార్, ఎంపీడీఓ., ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.