Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏర్పాటు ఓ సంచలనం. ఇందుకోసం హైదరాబాద్ లోని జలదృశ్యం వేదికైంది. 2001 ఏడాదిలో ఏప్రిల్ 27 కొంతమంది తెలంగాణవాదుల సమక్షంలో కేసీఆర్ ఈ పార్టీని ప్రకటించారు. టీడీపీకి రాజీనామా చేసిన కేసీఆర్.. పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఏర్పాటే ఏకైక అజెండాగా టీఆర్ఎస్ వస్తుందని స్పష్టం చేశారు. పార్టీ ఏర్పడిన కొద్దిరోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇందులో పోటీ చేసిన టీఆర్ఎస్… పలు స్థానాల్లో విజయం సాధించింది. ఇదే క్రమంలో తెలంగాణలోని పది జిల్లాల్లోనూ సభలు, పాదయాత్రల పేరుతో రాష్ట్ర ఏర్పాటు విషయంలో భావజాలవ్యాప్తికి ఎంతో కృషి చేసింది. ప్రత్యేక తెలంగాణ కోసం 2004లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. ఈ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసి.. 26 స్థానాల్లో విక్టరీ కొట్టింది. 6 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన టీఆర్ఎస్… ఐదింట్లో గెలిచి విజయబావుటా ఎగరవేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పై టీఆర్ఎస్ ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ క్రమంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ.. ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా దేశంలోని 36 పార్టీలు అనుకూలంగా లేఖలు ఇవ్వటంలో టీఆర్ఎస్ పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయా పార్టీలను ఒప్పించటంలో కేసీఆర్ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ… ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ బయటికి వచ్చింది.నాడు యూపీఏలో కేంద్రమంత్రులుగా ఉన్న కేసీఆర్. ఆలె నరేంద్ర రాజీనామాలే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు కూడా రాజీనామా చేశారు.కరీంనగర్ నుంచి ఎంపీగా ఉన్న కేసీఆర్ రాజీనామా చేశారు. ఇదే స్థానం నుంచి తిరిగి పోటీ చేసి.బంపర్ విక్టరీ కొట్టారు. ఈ విజయం టీఆర్ఎస్ చరిత్రలో ఓ మైలురాయి అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎన్నో ఎత్తుగడలను ఎదుర్కొంది టీఆర్ఎస్. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరటం వంటివి చకచక జరిగిపోయాయి. పార్టీ అధినేత కేసీఆర్ టార్గెట్ గా పలువురు నేతలు తీవ్ర విమర్శలు కూడా చేశారు.2009 ఎన్నికల్లో మహా కూటమిలో చేరింది టీఆర్ఎస్. చంద్రబాబుతో చేతులు కలిపారు. ఇందులో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవి చూసిది టీఆర్ఎస్. కేవలం 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీలతో సరిపెట్టుకుంది.ఇందులో కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ఉద్యోగాల భర్తీ సమయంలో ఫ్రీజోన్ పై సుప్రీం తీర్పునిచ్చింది. సరిగ్గా ఈ పరిణామమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినట్లు అయింది. రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఆ తరువాత కేసీఆర్ అరెస్ట్ కావటం ఆ వెంటనే ఖమ్మం తరలించారు. ఆయితే ఆయన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అక్కడ్నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా… దీక్షను కంటిన్యూ చేశారు. ఓ వైపు విద్యార్థి లోకం భగ్గుమంది.. తెలంగాణవ్యాప్తంగా నిరసనలు. ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది.సీమాంద్ర నేతల రాజీనామాలు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో జేఏసీ ఏర్పాటైంది. ఇందులో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు. అప్పటి వరకూ సొంతగా పోరాడిన టీఆర్ఎస్.. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేఏసీలో ముందువరుసలో నిలిచింది.రాష్ట్రంలోని ప్రధాన పార్టీలపై రాజకీయంగా ఒత్తిడి తీసుకురాగల్గింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించటం.. ఆ ఎన్నికల్లో భారీ విక్టరీ సొంతం చేసుకుంది. ఇలా 2014 వరకు ఉద్యమాన్ని తీసుకువచ్చింది.2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. దీంతో టీఆర్ఎస్ పాత్రపై అనేక ఊహగానాలు వచ్చాయి. కాంగ్రెస్ విలీనమవుతుందని అంతా భావించారు. కానీ ఇదే ఏడాది జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించింది. తొలిసారిగా అధికారాన్ని కైవసం చేసుకుంది. సీఎంగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్… 2018లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 88 సీట్లలో గెలిచి తిరుగులేని రాజకీయశక్తిగా మారిపోయింది.
ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని భావించిన కేసీఆర్… పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా (BRS) మార్చేందుకు సిద్ధమయ్యారు. 2022 అక్టోబరు 5న దసరా రోజున తెలంగాణ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో పేరు మారుపై 6 ఎమెల్వేలు మంది తీర్మానాన్ని ప్రతిపాదించారు. 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మధ్యాహ్నం 1.19 గంటలకు తీర్మానంపై సంతకం చేసిన అనంతరం సభ్యులు ఆమోదించిన తీర్మానంపై కేసీఆర్ ప్రకటన చేశారు.
వసంత్ విహార్ పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉన్న కారణంగా ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ తాత్కాలిక పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముందు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించారు.
2022 డిసెంబరు 22న తెలంగాణ శాసనసభ, తెలంగాణ శాసనమండలిలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ బులెటిన్ జారీ అయింది.2023 జనవరి 18న ఖమ్మం పట్టణం శివారులోని వీ వెంకటాయపాలెంలో బీఆర్ఎస్ పార్టీ పేరుతో తొలి సభ జరిగింది. ఇందుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది. 119 స్థానాలకు గాను కేవలం 39 స్థానాలను మాత్రమె గెలిచింది. దీంతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది.2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నిక్లలో 17 స్థానాల్లో పోటీ చేసి కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. బీఆర్ఎస్ చరిత్రలోనే ఇది తొలిసారి.ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మండలిలో మధుసూదనచారి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద భారీ సభను తలపెట్టారు.