

జనం న్యూస్ – ఏప్రిల్,28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
139 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వారసత్వంగా నిర్వహిస్తున్న మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కోరారు. నందికొండ మునిసిపాలిటీ హిల్ కాలనీ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కాళ్లగా మార్చారని, బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణకు పూనుకుంటున్నాయని అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చి వేసే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా మే 20వ తేదీన పది ట్రేడ్ యూనియన్లతో కలిసి దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ సమ్మెను ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ సంయుక్తంగా జయప్రదం చేయాలని కోరారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు శక్తులకు అప్ప చెబుతుందని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రజలకు రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. జమ్ము కాశ్మీర్లో 370 ఆర్టికల్ తొలగించి ఉగ్రవాదాన్ని అరికడతామని చెప్పిన బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయంలో ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాశ్మీర్ ప్రజల మధ్యన మతచిచ్చు రగిలించేలా పరిస్థితిలు తీసుకొస్తున్నారన్నారు. జమ్మూ కాశ్మీర్ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రo పై ఉందన్నారు. కేంద్రంలో మోడీ తన సొంత ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండా ను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు. రాజ్యాంగంలోని చట్టాలను సమూలంగా మార్చివేసి లౌకిక విధానాల సూత్రాలను మార్చి వేస్తున్నారన్నారు. ప్రజల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. చత్తీస్ గడ్ లో ఆదివాసీలపై ఆగడాలను బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 1 నుండి 20వ తేదీ వరకు మేడే ఉత్సవాలు నిర్వహిస్తామని మే 1వ తేదీన ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తామన్నారు. కార్మిక వ్యతిరేక విధానాల ను ప్రతిఘటన తెలియజేస్తూ మే 20 న నిర్వహించే జాతీయ సమ్మెకు ప్రతి ఒక్క కార్మికుడు మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు, సి ఐ టి యు నాయకులు ఎస్ కే బషీర్, స్థానిక నాయకులు చిరు నాగర్జున, గోవిందరాజు, రోశయ్య తదితరులు ఉన్నారు.