

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 28( ఎల్కతుర్తి మండలం బండి కుమార్ స్వామి రిపోర్టర్)
భూ భారతి చట్టం దేశానికే రోల్ మోడల్ అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఎల్కతుర్తి లోని ఓ ప్రైవేట్ అతిధి గృహంలో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సామాన్యు కోరిక మేరకు అంబేద్కర్ జయంతి రోజున చట్టాన్ని తీసుకువచ్చామని మంత్రి గుర్తు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మండలం పైలట్ ప్రాజెక్టు ఎంపిక చేసి అమలు చేస్తామన్నారు. అధికారులు ఎవరు తప్పు చేసిన శిక్షించే అవకాశం చట్టంలో ఉందని తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా రెవెన్యూ అధికారులే ఇంటికి వచ్చి సమస్యలని పరిష్కరిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రత్యేక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇల్లు అందించేందుకు కార్యకర్తలు సహకరించాలని సూచించారు. ఏ ఎన్నిక వచ్చిన సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో 2007లో గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తే కెసిఆర్ పదేళ్ల కాలంలో దానిని పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదన్నారు. 431 కోట్లతో కాలువలను తవ్వించామని గుర్తు చేశారు. రైతులకు ధాన్యం డబ్బులు 48 గంటల్లోనే ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. సన్న వడ్లకు బోనస్ రూ.500 చెల్లిస్తున్నామన్నారు. ధరణి కెసిఆర్ కుటుంబ చట్టమని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు విమర్శించారు. రాత్రికి రాత్రి చట్టాన్ని తెచ్చారని ఎద్దేవా చేశారు. మేధావులతో చర్చించి ఈ చట్టాన్ని రూపొందించారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ధరణిలో పాస్బుక్ ను సవరించుకునే అవకాశం లేదని హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. భూభారతిలో ఈ అంశాన్ని పొందుపరిచారని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఒడితల ప్రణయ్ బాబు, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ లింగమూర్తి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, ఎమ్మార్వో జగత్ సింగ్, ఎంపీడీవో విజయ్ కుమార్, డాక్టర్ రమేష్, గోలి రాజేశ్వరరావు, అంబల శ్రీకాంత్ (బక్కి) తదితరులు పాల్గొన్నారు.