

జనంన్యూస్. నిజామాబాద్, ఏప్రిల్ 29.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఆడిటోరియం హాల్ లో భూభారతి నూతన చట్టంపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని, భూభారతి చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని ఎమ్మెల్యే వివరించారు. ప్రధానంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సాదా బైనామాల క్రమబద్దీకరణకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని, ఏ విధంగా చూసినా ఇది రైతులకు వారి భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించేలా అన్ని అంశాలను పొందుపర్చారని తెలిపారు. ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. కాగా, పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తొలి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 మంది చొప్పున నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. లబ్ధిదారులు అందరూ ఇళ్లను నిర్మించుకునేలా వారికి తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నామమాత్రపు రుసుముతో ఇసుక సరఫరా అయ్యేలా చొరవ చూపాలని అన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ధరణి వల్ల పరిష్కారం కాని అనేక భూ సంబంధిత సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం జరిగేలా ప్రభుత్వం ఈ నూతన చట్టాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. ధరణిలో ఉన్న భూముల రికార్డులను భూభారతిలో నమోదు చేస్తారని అన్నారు. భూమి వివరాలు ఏమైనా తప్పుగా నమోదైతే, భూ భారతి చట్టం అమలులోకి వచ్చిన ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే, జూన్ మాసాలలో నిర్ణీత షెడ్యూల్ ను అనుసరిస్తూ అన్ని రెవెన్యూ గ్రామాలలో అధికారులు హాజరై రైతు సదస్సులు నిర్వహిస్తారని, భూ సమస్యలు కలిగిన రైతులు ఈ సదస్సులలో అర్జీలు సమర్పించవచ్చని అన్నారు. భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వాటిని తహసీల్దార్, ఆర్డీఓ లు తమతమ స్థాయిలో విచారణ జరిపి మ్యుటేషన్, రిజిస్ట్రేషన్లు చేస్తారని అన్నారు. వీటిపై రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం భూభారతి చట్టంలో రెండంచెల అప్పీలు వ్యవస్థను ప్రవేశ పెట్టిందని వివరించారు. అప్పీలు చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలోనే భూధార్ నెంబర్ కేటాయిస్తారని తెలిపారు. అంతేకాకుండా భూమి వివరాలు, హద్దులను స్పష్టంగా సూచించేలా భూ పటం (సర్వే మ్యాప్)ను పట్టా పాస్ బుక్కులలో పొందుపరుస్తారని అన్నారు. భూమి హక్కుల రికార్డులు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. ఇదివరకు అమలులో ఉన్న ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునే విధానం ఉండేదని, ప్రస్తుత భూ భారతి చట్టంలో హక్కుల రికార్డు పారదర్శకంగా ఉంటుందన్నారు. ఎవరైనా సర్టిఫైడ్ కాపీలు కావాలంటే భూ భారతిలోని ఫారంలో రూ.10 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని, తహశీల్దార్ సర్టిఫైడ్ కాపీలు జారీ చేస్తారని సూచించారు. గ్రామ పహానీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్లను ప్రభుత్వం నిర్వహిస్తుందని, భూమి హక్కుల రికార్డుల్లోని వివరాలను ఈ రికార్డులో ఆన్ లైన్ ద్వారా పొందుపరుస్తారని తెలిపారు. మ్యుటేషన్ చేసిన ప్రతిసారి ఆన్లైన్ లో గ్రామ లెక్కల్లో మార్పులు జరుగుతాయని, ప్రతి సంవత్సరం డిసెంబరు 31వ తేదీన గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారని అన్నారు. ఏటేటా రిజిస్టర్ల వివరాల అప్ డేట్, నిర్వహణ వల్ల భూముల వివరాలు పక్కాగా ఉంటాయని తెలిపారు.
ధరణి అమలైన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ నిలిచిపోయిందని, తిరిగి ప్రస్తుతం భూభారతి తో మళ్లీ రికార్డుల నిర్వహణ జరుగుతుందని వివరించారు. మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ లలో అధికారులు ఎవరైనా కావాలని తప్పిదాలకు పాల్పడితే, అలాంటి వారిపై కేసులు నమోదు చేసేలా భూభారతి చట్టంలో నిబంధనలు పొందుపర్చారని, తద్వారా పారదర్శకంగా సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే, సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం పోతంగల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సదస్సులో భూభారతి చట్టంపై రైతులకు కలెక్టర్, అదనపు కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సదస్సులలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.