

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్.,
జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ
సంఘటనలు జరగకుండా జిల్లాలోని ముఖ్య పట్టణాలైన విజయగరం, బొబ్బిలి, రాజాంలలో ఆకస్మికంగా ‘స్టేటిక్ స్ట్రేంజర్ చెకింగ్’ చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 10న తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ – దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణ నెలకొన్న
పరిస్థితుల్లో కొన్ని అసాంఘిక శక్తుల కారణంగా దేశ అంతర్గత భద్రతను ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించుటలో భాగంగా ముందస్తు భద్రత చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ముఖ్య పట్టణాలైన విజయనగరం వన్ టౌన్, టూ టౌన్, బొబ్బిలి, రాజాంపట్టణాల్లో మే 9న రాత్రి ఆకస్మికంగా ‘స్టేటిక్ స్ట్రేంజర్ చెకింగ్స్’ చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో పోలీసు అధికారులు,సిబ్బంది ఒక ప్రాంతంలోకి ఆకస్మికంగా ప్రవేసించి, ఆయా ప్రదేశాల్లో గుమిగూడిన వ్యక్తుల లగేజ్‌లు, బ్యాగుల్లో మద్యం, గంజాయి, డ్రగ్స్, బాంబులు, ఇతర ప్రేలుడు వస్తువుల గురించి కుణ్ణంగా తనిఖీ చేసి, వారి వ్యక్తిగత గుర్తింపు కార్డులను పరిశీలించి, వారు ఏ ప్రాంతం వారు?, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు?, ఎక్కడ ఉంటున్నారు? అన్న విషయాలను ఆరా తీసి, వారు చెప్పిన విషయాలను పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తరువాతనే వారిని విడిచి పెట్టామన్నారు. కొన్ని తీవ్రవాద గ్రూపులకు చెందిన వ్యక్తులు దేశంలోకి ప్రవేసించి ప్రజలు ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రాంతాలు, ప్రజా
సముదాయాల్లో విధ్వంసాలు, విభిన్న మతాల మధ్య మత కల్లోలాలు సృష్టించే అవకాశం ఉన్నందున, అటువంటి అసాంఘిక శక్తులను అణిచి వేయాలనే లక్ష్యంతో భద్రత చర్యలు చేపట్టామన్నారు. విజయనగరం వన్ టౌన్ పరిధిలోని రైల్వే స్టేషను, బస్టాండు, గణేష్ కోవెల, కలెక్టరాఫీసు వద్ద, విజయనగరం టూ టౌన్ పరిధిలోని కాటవీధి, పివిజి నగర్, పూల్‌బాగ్, లంకాపట్నం ప్రాంతాల్లోను, బొబ్బిలి పట్టణంలో రైల్వే స్టేషను, బస్టాండు, చర్చి సెంటరు, కోట జంక్షను వద్ద, రాజాం పట్టణంలోని మల్లికార్జున కాలనీ, సంత కాలనీ ప్రాంతాల్లో పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు,సంబంధి పోలీసు స్టేషను సిబ్బంది ‘స్టేటిక్ స్ట్రేంజర్ చెకింగ్స్’, బాంబ్ స్క్వాడ్ బృందాల ‘యాంటీ సేబిటేజ్’ తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, రాజాం పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా చేపట్టిన తనిఖీలను విజయనగరం డిఎస్పీ శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించగా,తనిఖీల్లో సంబంధిత సిఐలు ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాస్, కే.సతీష్ కుమార్, హెచ్.ఉపేంద్రరావు, ఎస్ఐలు, పోలీసు, ఎస్టీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.