

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్
జనం న్యూస్ 13 మే ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం పథకంలో తెలంగాణాలో కొత్తగా లబ్ధిదారుల నమోదుకు అవకాశం కల్పించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య ఏటా గణనీయంగా తగ్గుతోందని ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందడం లేదన్నారు. దీనికి ప్రధాన కారణం లబ్ధిదారులు చనిపోవడం, కొత్తగా రైతుల నమోదు ప్రక్రియ చేపట్టకపోవడమేనని అయన అన్నారు. 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులను మాత్రమే పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా పరిగణించడంతో ఆ తర్వాత నూతనంగా పట్టా పాస్ బుక్ పొందిన కొత్త రైతులు ఈ పథకానికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ కటాఫ్ తేదీని సడలించకపోవడంతో అర్హులైన కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందడంలేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుభరోసా పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ దశలవారీగా పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటికైనా రైతుల శ్రేయస్సు దృష్ట్యా కటాఫ్ తేదీని తొలగించి అర్హులైన రైతులందరికీ అవకాశం కల్పించి పీఎం కిసాన్ పెట్టుబడి సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.