

బుద్ధుడి హృదయమే భారత రాజ్యాంగం – బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, కొత్తగూడెం
జనం న్యూస్ 12మే ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )
ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, భారతదేశంలోని బహుజనవాదులు తమ సాంస్కృతిక రాజకీయ పండుగగా నిర్వహించుకునే రోజు బుద్ధ జయంతి. బుద్ధుని స్మరిస్తూ కొత్తగూడెం కేంద్రంలో ఏర్పాటు చేసిన బుద్ధ జయంతి కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ… రాజనీతికి శాస్త్రీయ దృక్పథాన్ని, నైతిక, తాత్విక గుణాలను జోడించి, సైన్యాన్ని నిర్మించి, రక్తపాతం లేకుండా సామాజిక రుగ్మతల పై జ్ఞాన యుద్ధం చేసి నైతిక సమ సమాజాన్ని, ఆదర్శ వాదాన్ని, మానవత్వాన్ని, స్వేచ్ఛ, కరుణను సుస్థిరం చేసే మానవ మనుగడ మార్గ నిర్దేశకుడు, శాంతి ప్రదాత, తాత్విక, రాజకీయ గురువు భగవాన్ గౌతమ బుద్ధుడు. జంబుద్వీపంగా పిలవబడే ప్రాచీన భారతదేశంలో కపిలవస్తు అనగా ప్రస్తుతం నేపాల్ రాజ్య లుంబిని నగరంలో శుద్ధోధనుడు, మాయా దేవికి జన్మించిన శాఖ్యా వంశ యువ రాజు. పినతల్లి గౌతమి పెంపకంలో గౌతముడయ్యాడు. యశోదరతో వివాహం చేసుకొని రాహులుడు అనే కొడుకుకు జన్మనిచ్చాడు. ప్రజల మానసిక రుగ్మతలకు, సామాజిక అసమానతలకు పరిష్కారం కొరకు రాజ్యాన్ని విస్మరించి గణరాజ్యాల ప్రాచీన సాంస్కృతిక రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నాడు. సింధు నాగరికత కాలం నాటి నైతిక విలువలు, సంఘ నియమాలను ప్రతిబిం మించేలా బుద్ధుని బోధనలు ఉంటాయి.సమాజంలో అలజడులు సృష్టించి అనైతిక, అసమానతలు, హింస వాదంతో రాజ్యం చేస్తున్న ఆర్యుల పైన సిద్ధాంతపురమైన ప్రతి వాద దాడితో దండెత్తిన ధర్మ యోధుడు. బాధితులకు, మూలవాసులకు రాజ్యాన్ని అందించే సిద్ధార్థుని మహా బోధనలు, ప్రేరణ, స్మరణ నేటికీ బహుజన వాదానికి దిక్సూచి. సామ్రాట్ అశోక చక్రవర్తి బుద్ధుని సాంస్కృతిక నేపథ్యాన్ని ప్రేరణగా తీసుకొని దుఃఖము లేని సమతా రాజ్యాన్ని స్థాపించాడు. అందుచేత రెండవ బుద్ధుడిగా కీర్తి గడించాడు. నాలుగు సింహాలు, ధర్మచక్రం వంటి స్మారక చిహ్నాలు రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమతా రాజ్య నియమాలు మీ దేశ పౌరులకు రక్షణ వలయాలుగా ఆ వారసత్వ జ్ఞానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోనూ, తన రచనలలో పొందుపరిచారు. 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఈ దేశంలో విద్య, ఉపాధి, సంపద, అధికారం దూరం చేసిన కొన్ని వర్గాల స్వార్థపూరిత రాజకీయాలపై భగవాన్ బుద్ధ మొదలుకొని కాన్షీరాం వరకు అలుపెరగని పోరాటం చేసినారు. ఆ వారసత్వ జ్ఞానాన్ని కొనసాగిస్తూ రాజ్యాంగఫలాలు అందరికీ అందే విధంగా ప్రజాస్వామ్య గణతంత్ర పాలన 100% అమలు జరగాలంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకం రాజ్యాధికారాన్ని అందుకునే దిశగా చైతన్యం కావాలని పిలుపునిస్తూ, “బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ” ఆధ్వర్యంలో కొత్తగూడెం కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ నందు గల రావిచెట్టు వద్ద బుద్ధుడి ప్రతిమను ప్రతిష్టించుటకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. జేఏసీ నాయకులు సామ్రాట్ సంజీవన్ మహారాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా బీసీ సంఘాల నాయకులు మల్లెల రామనాథం, బహుజన నాయకులు యర్ర కామేష్, న్యాయవాది మారపాక రమేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంకివీడు ప్రసాద్ రావు, మహేష్ తదితర బహుజనవాదులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు.