

ఆపరేషన్ సింధూర్ పై భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సుందరపు
జనం న్యూస్,మే17, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో
తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎలమంచిలి నుంచి తెరువుపల్లి వరకు జరిగిన ర్యాలీలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, చైర్పర్సన్ రమాకుమారి పాల్గొని భారతమాతకీ జై, వందేమాతరం నినాదాలు చేసి జాతిపట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ, ఇటీవల విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ పై ఎమ్మెల్యే భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సైనికులు వీరోచితంగా దేశ రక్షణ కోసం రాడుతున్నారన్నారు. పిఎం, సీఎం,డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పహల్గామాలో తెలుగువారు ఇద్దరుతో సహా పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన బాధాకరమన్నారు. ఆపరేషన్ సింధూర్‌కు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. మన దేశ ఐక్యతను దెబ్బతీయాలనే ఉగ్రవాదుల ప్రయత్నాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 23 ఏళ్ల మురళీ నాయక్ దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయన తల్లికి సెల్యూట్ చేయాలన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. మత విద్వేషాలు రేకెత్తించే వారిపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సైనికులను సన్మానించి, వారి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కూటమి నాయకులు,కార్యకర్తలు గ్రామపెద్దలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.