Listen to this article

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

జనం న్యూస్ మే 23, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో భారత ప్రభుత్వ గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రారంభించిన ఏక్ పేడ్ మాకే నామ్ / ఉమెన్ ఫర్ ట్రీస్ క్రింద ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లుల పేరిట ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా మాతృమూర్తులను గౌరవించుకుందామని అన్నారు. ప్రస్తుత వాతావరణంలో వస్తున్న మార్పులను తట్టుకునేందుకు, పట్టణాలలో పెరుగుతున్న వేడిని నియంత్రించేందుకు, బ్లూ, గ్రీన్ మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు అమృత మిత్ర కార్యక్రమం క్రింద మహిళా సంఘాల సభ్యులతో ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ అధికారులు, అమృత మిత్ర సభ్యులు పట్టణాలలో గుర్తించిన చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ, పార్కులలో చెట్లు నాటేందుకు అనువుగా ఉండే ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటి వాటిని రక్షించుకోవాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పథకంలోని అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లాస్థాయి కమిటీకి పంపించాలని అధికారులకు సూచించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, అల్ప సంఖ్యాక వర్గాలలో అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం యూనిట్లు ప్రారంభించేందుకు రాయితీతో కూడిన రుణ సదుపాయం కల్పిస్తుందని, జూన్ 2వ తేదీ నాటికి అర్హులైన వారికి మంజూరు పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసి జిల్లా కమిటీకి సమర్పించాలని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రోత్సహిస్తుందని తెలిపారు. వివిధ పనుల కొరకు కార్యాలయానికి వచ్చే వారికి క్యాంటీన్ ఎంతో సౌకర్యంగా ఉంటుందని, నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, తహసిల్దార్ కిరణ్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, కాగజ్ నగర్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి మనోహర్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మోతిరామ్, అమృత మిత్ర సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు