

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
గడచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా వేసిన లే అవుట్లను కూడా అధికారులు తక్షణమే క్రమబద్ధీకరించాలని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడా ఒక్క అక్రమ లే అవుట్ లేదని, ఒకటీ.. అరా ఉన్నా అధికారులు వెంటనే వాటిపై ఉక్కుపాదం మోపాలని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు, ఆదాయార్జన విభాగాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రమ లే అవుట్లపై సమీక్ష చేసి, మున్సిపల్ అధికారులకు పలు కీలకసూచనలు చేశారు. అక్రమ లే అవుట్లు ఎవరువేసినా పార్టీలకు అతీతంగా వారిపై చర్యలుంటాయని తేల్చిచెప్పారు. అనుమతుల్లేని లేఅవుట్ల తొలగింపుపై అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, అవసరమైతే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కఠినచర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. చట్టప్రకారం, నిబంధనలకు అనుగుణంగా రియల్ వ్యాపారం చేస్తే ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించిన వారిపై కూడా కఠినచర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాల సమస్యలు పరిష్కారం కాకుంటే, వార్డుల్లోని పరిస్థితులపై సభ్యులు తనకు తెలియచేయాలన్నారు. అక్రమ తాగునీటి కొళాయి కనెక్షన్లను కూడా వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ప్రజలకు నిత్యావసరమైన సమస్యల పరిష్కారంలో రాజీపడేది లేదని పుల్లారావు తేల్చిచెప్పారు. పట్టణంలోని పార్కుల్లో అన్నిసౌకర్యాలు ఏర్పాటుచేయాలని, పిల్లలు.. వృద్ధులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉండాలన్నా రు. సచివాలయ సిబ్బంది కూడా మున్సిపల్ కమిషనర్ ఆదేశాలప్రకారం నడుచుకంటూ, సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎవరినీ ఎంతమాత్రం ఉపేక్షించబోనని మాజీమంత్రి స్పష్టంచేశారు. గత ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన వైసీపీ ప్రభుత్వం ప్రజల గురించి, వారి సమస్యలు, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా అవినీతి, అక్రమార్జనపైనే దృష్టిపెట్టిందని పుల్లారావు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే రోడ్లపై గుంతలు పూడ్చేపనులు ప్రారంభమయ్యాయని, పట్టణంలో రోడ్లపై ఎక్కడా గుంతలు ఉండటానికి వీల్లేదని ఆయన స్పష్టంచేశారు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్ల ప్రజల్లో తాము చులకన కాకూడదన్నారు. సమావేశానికి ముందు మాజీమంత్రి పట్టణంలో పలుప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని అధికారులు, కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. కొన్నిచోట్ల పనులు నిదానంగా సాగుతుండటంపై అధికారులను అప్రమత్తం చేసి, తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డిఈ రహీం, టీ.పి.ఓ సుజాత, మున్సిపల్ సిబ్బంది మరియు జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు పఠాన్ సమాద్ ఖాన్, మద్దుమాలా రవి, కౌన్సిలర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.