Listen to this article

డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి.

సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోంది ప్రజలు ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్… “విలాసవంతమైన వస్తువులిస్తామని,ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని,విదేశీ యాత్రలకు పంపుతామని, రకరకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి, ప్రజల నుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి, వారితో మరి కొంత మందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ, ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజలని మభ్యపెట్టే కొత్త కొత్త టెక్నిక్ లతో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారని,ఇలాంటి నూతన స్కీం ల పట్ల,నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందనీ మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల ప్రజలకు బుధవారం ఒక పత్రిక ప్రకటనలో సూచించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోయిందన్నారు. ప్రతినిమిషం సెల్‌ ఫోన్‌ లేనిది ఏ పని చేయలేకపోతున్నారని తెలిపారు. బ్యాంక్‌ ఖాతా, పాన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డు, పెన్షనుకు సెల్‌ నంబర్‌ అవసరంగా మారిందన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు ప్రజలకు ఏదో ఒక ఆశ చూపి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలపట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.