
జనం న్యూస్, జూన్ 12( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో ఫార్మర్ ఐడీ కార్డుల కోసం రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన ఫార్మర్ ఐడీ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల ద్వారా ప్రతి రైతు నుంచి రూ.50 నుండి రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ ఐడి, పాస్వర్డ్లను ప్రైవేట్ కేంద్రాలకు, మీ సేవ కేంద్రాలకు అందజేసి, వారి ద్వారానే దరఖాస్తులు చేయాలని సూచించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. మర్కుక్ మండలానికి చెందిన మర్కుక్ క్లస్టర్ పరిధిలోని ఆరు గ్రామాల్లో సుమారు 3500 మంది రైతులు ఉన్నారు. ప్రజలంతా మీ సేవల ద్వారానే అప్లై చేసుకోవాలని వ్యవసాయ అధికారులే చెప్పినట్టు ప్రజలు తెలిపారు .రైతులు ఎటువంటి ఖర్చులు లేకుండానే ఫార్మర్ ఐడీ కార్డులు పొందాలన్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధంగా ఈ డబ్బుల వసూలు కొనసాగుతోంది. సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.