Listen to this article

జనంన్యూస్. 18.నిజామాబాదు. ప్రతినిధి.

రైతు భరోసాతో అన్నదాతకు ఆదరువు కల్పించిన ప్రభుత్వం.

వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ, రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.వానాకాలం – 2025 సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం క్రింద జిల్లాలో 2,98,472
మంది రైతులకు రూ. 326.03 కోట్ల నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోందని అన్నారు. రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేశారని అన్నారు. ఈ వివరాలకు అనుగుణంగా మంగళవారం సాయంత్రం వరకు జిల్లాలోని 2,12,172 మంది రైతుల ఖాతాలలో రూ. 160.72 కోట్ల నిధులు ఇప్పటికే జమ అయ్యాయని కలెక్టర్ వివరించారు. పెట్టుబడి సాయం ప్రారంభించిన మొదటి రోజైన ఈ నెల 16వ తేదీన రెండు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన జిల్లాలోని 1,681,66 మంది రైతుల ఖాతాలలో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున రూ. 95.66 కోట్ల పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం వారి ఖాతాలలో జమ చేసిందని తెలిపారు. తాజాగా మంగళవారం మూడెకరాల వరకు సాగు భూమి ఉన్న 44,006 మంది రైతుల ఖాతాలలో రూ. 65.06 కోట్ల నిధులు జమ చేసిందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వివరించారు. మొదటి రెండు రోజులలోనే మొత్తంగా జిల్లాలో 2,12,172 మంది రైతుల ఖాతాలలో రూ. 160.72 కోట్ల నిధులు జమ అయ్యాయని అన్నారు.మిగతా రైతులకు కూడా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి వారి ఖాతాలలో జమ చేయనుందని తెలిపారు. పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతు భరోసా ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్ అన్నారు. కాగా, ఇచ్చిన హామీ మేరకు వానాకాలం సాగు ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందించడం పట్ల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.