

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
జనం న్యూస్ జూన్ 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
జిల్లాలో మాదకద్రవ్యాలను విక్రయించిన, వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్.పి. కాంతిలాల్ సుభాష్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి మాదకద్రవ్యాల నివారణపై పోలీస్, రెవెన్యూ, సంక్షేమ, విద్య, వైద్య ఆరోగ్య, రవాణా, గిరిజన సంక్షేమ, పంచాయితీ రాజ్, వ్యవసాయ, అటవీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగాలు జరగకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో గంజాయి సాగు చేయకుండా అధికారులు పర్యవేక్షించాలని, ఎవరైనా గంజాయి సాగు చేసినట్లయితే వారిని గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా లభించే పథకాల లబ్ధిని రద్దు చేయాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలు, కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని, విద్యాసంస్థల పరిసరాలలో గల కిరాణా దుకాణాలు, పాన్ టేలాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. సరిహద్దు జిల్లా అయినందున పక్క రాష్ట్రం నుండి వచ్చే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేయాలని, ఆటో, లారీ డ్రైవర్లు, కూలీలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మందుల దుకాణాలలో మత్తుపదార్థాలకు సంబంధించిన విక్రయాలపై తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ డ్రగ్స్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు మహిళ సంఘాలతో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీలు నిర్వహించాలని, నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు జిల్లా ఎస్. పి. మాట్లాడుతూ వచ్చే 2 నెలలలో పోలీస్ కళాజాత బృందం వారిచే జిల్లాలలో ప్రతి సోమవారం గురువారం మాదకద్రవ్యాల నిర్మూలనపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను విక్రయించిన, వినియోగించిన వారిని గుర్తించి వారిపై పి.డి. యాక్టు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణా వినియోగంపై ప్రత్యేక నిఘా నిర్వహిస్తామని, సరిహద్దు ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపడతామని, అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, జిల్లా రవాణా అధికారి రామ్ చందర్ జిల్లా మాధ్యమిక అధికారి కళ్యాణి వ్యవసాయ విద్య, ఆబ్కారీ జాతీయ రహదారులు డ్రగ్స్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు