Listen to this article

చంద్రబాబు, పవ‌న్‌ల‌పై మాజీ ఎంపీపీ, స్టేట్ ఆర్టీఐ విభాగం జనరల్ సెక్రటరీ కడప వంశీధర్ రెడ్డి ఫైర్.

గిద్దలూరు ప్రతినిధి, జూన్ 28 (జనం న్యూస్):

గిద్దలూరు: కూట‌మి ప్ర‌భుత్వం చేసిన మోసాల‌పై ప్రజల తరఫున మేము పోరాడతామ‌ని మాజీ ఎంపీపీ స్టేట్ ఆర్టీఐ విభాగం జనరల్ సెక్రటరీ కడప వంశీధర్ రెడ్డి పేర్కొన్నారు. హామీలు అమ‌లు చేసే వ‌ర‌కు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ.. నిల‌దీస్తామ‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను హెచ్చ‌రించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల్లో మీరంతా గజకర్ణ, గోకర్ణ విద్యలు ప్రదర్శించి మోసంతో గెలిచారు. గెలిచాక …మీరిచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది క‌దా?. మిమ్మల్ని నిలదీసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. ఎన్నికల సమయంలో అనేక హామీ­లిచ్చి, అధికారం చేపట్టాక ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు మా నాయకుడు వైయ‌స్ జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ..‘రీకాలింగ్‌ చంద్ర­బాబూస్‌ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ…) కార్య­క్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేప‌డుతున్నాం. చంద్రబాబు ఎన్నికల సమ­యంలో ‘బాబు ష్యూరిటీ–­భవిష్యత్‌ గ్యారెంటీ’ పేరుతో కుటుంబాల వారీగా వర్తించే పథకాల పేర్లు పేర్కొంటూ ఇచ్చిన బాండ్లను చూపించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కలిగిన లబ్ధి, చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం చేపడతాం. చంద్ర­బాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం సాగిస్తూనే ఉంటాం అని వైసీపీ స్టేట్ ఆర్టీఐ విభాగం జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి స్పష్టంచేశారు.