Listen to this article

జనంన్యూస్. 30.నిజామాబాద్,ప్రతినిధి.

పదవ తరగతి 2024 – 2025 వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులను జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. ఇదివరకటితో పోలిస్తే ప్రభుత్వ బడులలో ఉత్తీర్ణత ఎంతో మెరుగుపడిందని, ఇదే స్పూర్తితో వచ్చే విద్యా సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని హితవు పలికారు. ప్రత్యేకించి ప్రభుత్వ బడుల నిర్వహణ మెరుగయ్యేలా మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని, తమ సొంత ఇంటిని తీర్చిదిద్దుకునే విధంగానే సర్కారీ బడులలో ప్రమాణాలు మెరుగుపడేలా చొరవ చూపాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని బడులలో విద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. చక్కగా పనిచేసే వారిని తప్పనిసరిగా ప్రోత్సహిస్తామని, ప్రతి ఒక్కరు తమ విధులకు పూర్తి న్యాయం చేస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, విద్యా, క్రీడ, పర్యాటక రంగాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ప్రతి పాఠశాలలో సౌకర్యాలు, విద్యా బోధన మెరుగుపడేలా కృషి చేయాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు సైతం ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దాలని అన్నారు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు వంటి వాటి బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో సీఎం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నారని అన్నారు. చాలాకాలం నుండి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఇటీవలే ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తు చేశారు.కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఇదివరకటి రెండు సంవత్సరాలలో పోలిస్తే, ఈసారి పదవ తరగతిలో జిల్లాలో సగటు ఉత్తీర్ణత మెరుగుపడిందని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాల సాధన కోసం ఇప్పటినుండే నాణ్యమైన విద్యా బోధనపై దృష్టిని కేంద్రీకరించాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. గణితం, ఆంగ్లం, సామాన్య శాస్త్రం వంటి సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా అధికారులకు క్రమం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ, నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా వసతుల కొరత ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎస్సెస్సీలో మెరుగైన ఫలితాల సాధన, అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు, నాణ్యమైన విద్యా బోధన గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలన్నారు. ఎస్సెస్సీలో 586 మార్కులు సాధించిన డొంకేశ్వర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తోట రక్షితను అభినందిస్తూ ముఖ్య అతిథులు సత్కరించారు. అలాగే, 584 మార్కులు సాధించిన ఓరగంటి గంగాగోపాల్, గట్టు షైనీ, 582 మార్కులు పొందిన ఎస్.దీప్తి, డి.వైశాలి, 579 మార్కులు సాధించిన వై.కీర్తన, 577 మార్కులు సాధించిన అలేఖ్య, వై.గ్రీష్మ, జంగిటి అక్షరలను ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఘనంగా సన్మానించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పల్లికొండ, డొంకేశ్వర్, రాంపూర్, మెండోరా, అమ్రాద్, చౌట్పల్లి, జక్రాన్పల్లి, మోస్రా, కల్లెడి, రెంజల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కూడా సత్కరించారు. ప్రభుత్వ బడులలో అత్యధికంగా విద్యార్థులను చేర్పించిన బోర్గం(పి) హైస్కూల్, బోధన్ రాకాసిపేట్ బాలికల ఉన్నత పాఠశాల, చిట్టాపూర్ ప్రైమరీ స్కూల్, తుంపల్లి ప్రైమరీ స్కూల్, ఫులాంగ్ బాలుర ఉచ్చతర ప్రాథమిక పాఠశాలల హెచ్.ఎంలను కూడా సత్కరించారు. సోమవారం నాటితో పదవీ విరమణ చేసిన ముగ్గురు ఎంఈఓలు, ముగ్గురు హెచ్.ఎం లను ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్, ఎం.ఈ.ఓలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గజిటెడ్ హెచ్.ఎంలు, కాంప్లెక్ హెచ్.ఎంలు, ఎంఆర్పీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.