Listen to this article

జనంన్యూస్ 01.నిజామాబాదు. ప్రతినిధి.

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

వన మహోత్సవంలో కీలకమైన నర్సరీల నిర్వహణలో మరింతగా మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ఇందల్వాయి మండలం గౌరారంలో కొనసాగుతున్న నర్సరీని తనిఖీ చేశారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న వివిధ రకాల మొక్కలను పరిశీలించారు. లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఇళ్ల వద్ద నాటే మొక్కలను, అవెన్యూ ప్లాంటేషన్ కోసం ఉద్దేశించిన మొక్కలను వేరువేరుగా విభజిస్తూ పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. వచ్చే సీజన్ వన మహోత్సవం కోసం ఇప్పటి నుండి అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుని, తదనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గౌరారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి గురించి తన వెంట ఉన్న ఎంపీడీవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 32 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ తెలుపగా, 29 గ్రౌండింగ్ అయ్యాయని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 7 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయ్యాయని, మూడు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకునేలా చూడాలని, క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరుపుతూ, లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట పంచాయతీ కార్యదర్శి ప్రేమలత తదితరులు ఉన్నారు.