

జనం న్యూస్,జూలై05,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలం గురజాపాలెంలో ఆటిజం సపోర్ట్ శిక్షణా కేంద్రం మరియు కోస్టల్ ఆంధ్ర ఉపాధ్యాయ సిబ్బంది శిక్షణ కేంద్రం ఏర్పాటుకు గురజాపాలెంలో ఉన్న పాఠశాలను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు రాష్ట్ర సమగ్ర శిక్ష ఆటిజం కేంద్రాల ఎక్స్పర్ట్ శ్రీ రామ్ కమల్ మనోజ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్యుతాపురం మండలం గురజాపాలెంలో ఆటిజం శిక్షణాకేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కేంద్రంలో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఒకేషనల్ ట్రైనింగ్ మరియు లెర్నింగ్ సపోర్ట్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్, మాథ్స్ మరియు రోబోటిక్స్ ల్యాబ్స్, అడ్వాన్స్డ్ ఫిజియో మరియు న్యూరో ఎబిలిటీ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా కోస్టల్ ఆంధ్రాలో ఉన్న ప్రత్యేక ఉపాధ్యాయ సిబ్బందికి ఆటిజం పై శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కేంద్రంలో దివ్యాంగ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కొరకు హైడ్రో థెరపీ మరియు ఈతకొలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు.ప్రత్యేక అవసరాలు గల ఆటిజం పిల్లల కొరకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ద్వారా ఆటిజం సపోర్ట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ఆటిజం సపోర్ట్ కేంద్రాల వలన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆటిజం దివ్యాంగ విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, వాళ్ళకి ఆశాకిరణంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల డిజిటల్ విద్య రాష్ట్ర రిసోర్స్ పర్సన్, ప్రత్యేక ఉపాధ్యాయుడు బి. మహాలక్ష్మి నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.