

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 5 రిపోర్టర్ సలికినీడి నాగు
గతంలో వైద్యారోగ్యమంత్రిగా పనిచేసిన మాజీ అవినీతిమంత్రి ఆసుపత్రికి రూపాయి కేటాయించలేదు : ప్రత్తిపాటి
చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రి అభివృద్ధికి 2014-19లో టీడీపీ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. : ప్రత్తిపాటి
మరలా ఇప్పుడు కూటమిప్రభుత్వ సహకారంతో రూ.10కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టాం :
ప్రత్తిపాటి. రూ.10 కోట్లతో ఆసుప్రతిలో మౌలిక వసతుల కల్పనతో పాటు, పరికరాల కొనుగోలు : ఎంపీ లావు
గత ప్రభుత్వంలో నియోజకవర్గం నుంచి వైద్యారోగ్యశాఖమంత్రిగా పనిచేసిన మాజీ అవినీతి మంత్రి స్థానిక 100 పడకల ఆసుపత్రిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, 2014-19లో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన రూ.15కోట్లు తప్ప, గతపాలకులు రూపాయి కేటాయించలేదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి..ఎంపీ లావు కృష్ణదేవరాయలతో కలిసి శనివారం స్థానిక 100 పడకలఆసుపత్రిలో రూ.10కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధిపనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడి, సమస్యలపై ఆరాతీశారు. రోగులను అడిగి వైద్యసేవలు అందుతున్న తీరును తెలుసుకున్న ఎమ్మెల్యే..ఎంపీలు అనంతరం విలేకరులతో మాట్లాడారు 2014-19లో టీడీపీ కేటాయించిన 15కోట్లు తప్ప, గత పాలకులు రూపాయి ఇవ్వలేదు చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు పక్కన ఉండే పర్చూరు అద్దంకి నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రధాన ఆసుపత్రిని గతపాలకులు పూర్తిగా నిర్లక్ష్యంచేశారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి రూ.15కోట్లు కేటాయిస్తే, గత ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి, మాజీ అవినీతి మంత్రి, సొంతశాఖ నుంచి ఆసుపత్రి అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. అంతటి అసమర్థులు కనుకనే ప్రజలు వారిని తిరస్కరించి, పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించారని ప్రత్తిపాటి చెప్పారు. వైద్యారోగ్యమంత్రి సత్యకుమార్, ఆశాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చొరవతో ప్రభుత్వం రూ.10కోట్లు మంజూరుచేసిందని, ఆ నిధులతో నేడు ఆసుపత్రి కాంపౌండ్ వాల్, ముఖ్యమైన పరికరాల కొనుగోలు, షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. పనుల్ని త్వరితగతిన పూర్తిచేసి, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మూడు నియోజకవర్గాలకు కీలకమైన ఆసుపత్రిని 100 పడకల నుంచి 300 పడకలకు పెంచి, మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వంతో చర్చిస్తామని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. రూ. 10 కోట్లతో రోగులకు అవసరమైన పరికరాలు.. మౌలిక వసతులు కల్పించనున్నాం : ఎంపీ లావు ఆసుపత్రిలోని పలు ప్రధాన విభాగాలకు అవసరమైన పలు పరికరాలు సమకూర్చడంతో పాటు, ఇతర మౌలికవసతుల కల్పనకు రూ.10కోట్లు వెచ్చించనున్నట్టు ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. ఆసుపత్రి పాత భవనంలో చిన్నచిన్న మరమ్మతులు ఉన్నాయని, అవికూడా త్వరలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కూటమిప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అడిగిన వెంటనే ఆసుపత్రి అభివృద్ధికి మంత్రి సత్యకుమార్ నిధులు కేటాయించారని ఎంపీ స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, కందుల రమణ, ముప్పాళ హనుమంతరావు,ముల్లా కరిముల్లా, మురకొండ మల్లిబాబు, మారెళ్ళ ఇందిరా, ఆసుపత్రి కమిటీ సభ్యులు తదితరులున్నారు.