

జులై 9న సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి–భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU)
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జూలై 05 :
భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ యఫ్ టి యు) ఏన్కూరు మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏన్కూర్ మండలం తిమ్మారావుపేట గ్రామంలో జరిగింది.ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) జిల్లా అధ్యక్షులు షేక్ సుభహన్ పాల్గొని మాట్లాడుతు,జులై 9 నాడు దేశంలో మరో అతిపెద్ద సార్వత్రిక సమ్మె జరగబోతుందని,ఈ సమ్మెలో సుమారు 55 కోట్ల పైగా కార్మికులు పాల్గొంటున్నారని,ఈ సమ్మె దేశంలోనే అతి పెద్ద సమ్మెగా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల మెడల మీద వేలాడే కత్తుల లాంటి నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి,కార్మికుల గౌరవాన్ని,కార్మికుల లక్ష్యాన్ని,కార్మికుల స్వేచ్ఛను హరిస్తున్నారని అన్నారు.ముఖ్యంగా కార్మిక,రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసే అంతవరకు ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం,రైతాంగం,ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్మికులకు నష్టకరంగా ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా అవి రద్దయేంతవరకు పోరాడవాల్సిన సమయం అని అన్నారు. ఈ దేశ సంపదను కూడగడుతున్నటువంటి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తూ,దేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీల యాజమాన్యానికి పూర్తి సర్వహక్కులు కల్పించే విధంగా నాలుగు లేబర్ కోడ్ లు ఉన్నాయి అని అన్నారు.8 గంటల పని దినాన్ని రూపుమాపి కార్మికులు 12 గంటలకుపైగా పనిచేసేలాగా నూతన చట్టాలను రూపొందిస్తున్నారని,ఏది ఏమైనా కార్మికవర్గాన్ని,కట్టు బానిసత్వానికి గురి చేసేవే 4 లేబర్ కోడ్ లు అని అన్నారు.ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్,స్కీం వర్కర్ల క్రమబద్ధీకరణ చేయాలనీ, కనీస వేతనం నెలకు 26000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాన్ని ఆపాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని,అసంఘటిత కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్,ఈఎస్ఐ,పెన్షన్ తదితర చట్టబద్ధ హక్కులన్నీ, అమలు చేయాలని,కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక హక్కుల రక్షణ కోసం జులై 9న జరుగు దేశవాపిత సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ నాయకులు శిరోమణి,పారిజాతం,కోటమ్మ, వెంకట్ లక్ష్మి,హైమావతి ఐ ఎఫ్ టి యు నాయకులు భాను,గౌని మోహన్ రావు,ప్రశాంతి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.