

చెరువు చుట్టూ ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ ను ఎత్తుకెళ్లిన దొంగలు కానరాని సీసీ కెమెరాలు
జనం న్యూస్ జూన్ 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సాయంత్రం ఆరు గంటలు దాటితే చాలు అక్కడ మందుబాబులు చిందులేస్తారు.హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చీకటిపడితే చాలు మందుబాబులు ఇక్కడ తిష్ట వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సెక్యూరిటీ లేకపోవడతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు బానిస అయిన యువత చెడిపోతున్న తరుణంలో అంబీర్ చెరువు చుట్టూ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. చెరువుగట్టు పై ప్రతిరోజు యువకులు బర్త్డే పార్టీలు హంగామా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి మందుబాబులు చిందులేస్తున్నారు. నిత్యం అక్కడ దర్శనమిచ్చే మందు బాటిళ్లు ,బీరు సీసాలు ఇందుకు నిదర్శనం. మద్యం సేవించడం తోపాటు బీరు బాటిళ్లను, మద్యం బాటిళ్లను మద్యం బాబులు పగలగొడుతున్నారు.మరికొందరు జంటలుగా వచ్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.చెరువు చుట్టూ ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ ఎత్తుకెళ్లిన దొంగలు అంబీర్ చెరువు చుట్టూ ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ ను రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్తున్నారు. ఇలాగా వదిలేస్తే అంబీర్ చెరువు చుట్టూ ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ ను మొత్తం దొంగల పాలు అవుతుందని అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.