Listen to this article

జనం న్యూస్ జూలై 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను 2025 సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని,ఈ తీర్పు బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎటువంటి అడ్డంకి కాదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశంపై చర్యలు తీసుకునేందుకు తగిన సమయం లభించిందని గురువారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పొనుగోటి రంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హైకోర్టు తీర్పుపై స్పందించారు.కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ లను 42% పెంచడానికి నెల రోజుల సమయం సరిపోతుందని,బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచకుండా ఎన్నికలకు వెళితే బీసీలు ఎట్టి పరిస్థితుల్లో సహించరని ఆన్నారు. వాస్తవంగా రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్రంపై నెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.స్థానిక సంస్థల్లో బిసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనీ,73-74 వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డి6 ప్ర కారం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన అధికారం ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా బీసీల విషయంలో రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధితో రేపటి నుండే రిజర్వేషన్ల పెంపు పై కార్యాచరణ మొదలు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.