

విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు
జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించాలంటే సంబంధిత వ్యక్తులు ముందస్తుగా పోలీసుశాఖ అనుమతి పొందాలని విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సెక్షన్ 30 పోలీసు చట్టం-1861, నెల రోజులపాటు అమలులో ఉంటుందన్నారు. ఈ చట్టం ప్రకారం విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ చట్టం-1861లోని సెక్షన్ 30 ప్రకారం ఊరేగింపులు, బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు మొదలైన వాటి నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రశాంతత దృష్ట్యా, వివిధ రాజకీయ పార్టీలు/సమూహాలు/సంస్థలు ఊరేగింపులు, సమావేశాలు, ధర్నాలు, బంద్ పిలుపులు, రోడ్లపై మరియు రోడ్డు పక్కన గుమిగూడటం, రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకేసారి, ఒకే చోట రోడ్ షోలు మరియు ఊరేగింపులు నిర్వహించినప్పుడు శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి వివిధ పార్టీలు/సమూహాలు నిర్వహించే ఇటువంటి బహిరంగ సభలు లేదా ఊరేగింపులను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శాంతిభద్రతలు మరియు ప్రజల ప్రశాంతత దృష్ట్యా, ఊరేగింపులు, బహిరంగ సభలు, ర్యాలీలు మరియు ధర్నాలు మొదలైన వాటికి విజయనగరం సబ్-డివిజనల్ పోలీస్ అధికారి నుండి ముందస్తు అనుమతి లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. కావున, ప్రజలు గమనించాలని, తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు కోరారు.