Listen to this article

వీధి దీపాల నిర్వహణను మరచిన అధికారులు

జనం న్యూస్- జూలై 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గల 12 వార్డులలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల అలంకార ప్రాయంగా మారాయి, మరికొన్ని చోట్ల నెలల తరబడి మరమ్మతలకు నోచుకోవడం లేదు. నందికొండ మున్సిపాలిటీలోని పలు వార్డులలో విధి దీపాలు వెలుగక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. హిల్ కాలనీ మెయిన్ బజార్ లో సైతం వెలగని వీధి దీపాలు,మరమ్మత్తులు చేయరు కొత్తవి బిగించరు. వీధి దీపాల నిర్వహణను మరచిన మున్సిపల్ అధికారులు. స్థానిక సత్యనారాయణ స్వామి గుడి వద్ద నుంచి నెహ్రూ పార్క్ వరకు, ముత్యాలమ్మ గుడి నుంచి పైలాన్ సమాధుల వరకు జాతీయ రహదారి వెంబడి కూడా వీధిలైట్లు వెలగని పరిస్థితి, రాత్రి సమయంలో వీధి దీపాలు వెలగక సత్యనారాయణ స్వామి గుడి వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు, బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు, కెనాల్స్ లోని ఎస్సీ హాస్టల్ వద్ద కూడా వీధి దీపాలు వెలుగక హాస్టల్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కాలనీలలో కోతుల బెడద అధికంగా ఉండటంతో రాత్రి సమయాల్లో అవి ఎక్కడ దాడి చేస్తాయో అని పాదచారులు, కాలనీవాసులు భయపడుతున్నారు.వార్డులలో సైతం చాలా చోట్ల వీధి దీపాలు మరమ్మత్తులకు నోచుకోని వైనం. వీధి దీపాల నిర్వహణ బాధ్యత ఎవరిది? పురపాలికలలో వీధి దీపాల నిర్వహణ బాధ్యత చూడాల్సిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థ పట్టించుకోవడం లేదా? వీధి దీపాల నిర్వహణకు ఆ సంస్థ బిల్లులు చెల్లించడం లేదా ఒకవేళ చెల్లిస్తే ఆ డబ్బులు దేనికి ఉపయోగించినట్లు అన్నది ప్రశ్నార్థకం. వీధి దీపాల మరమ్మత్తులకు నందికొండ మున్సిపాలిటీలో ఎలక్ట్రీషియన్ ఉన్నారా, గతంలో లా ప్రైవేటు వ్యక్తులకి లైట్ కి కొంత మొత్తం చొప్పున ఇచ్చి మరమ్మత్తులు చేయిస్తారా అన్నది వేచి చూడాలి.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు త్వరితగతిన స్పందించి వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.