

జనం న్యూస్ జూలై 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కలకోవా గ్రామంలో గురువారం నిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించామని టీబి నోడల్ పర్సన్ లింగం రామకృష్ణ తెలిపారు. ఈ వైద్య శిబిరానికి మొత్తం 125 మంది హాజరయ్యారని, సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి తీసుకుని వచ్చిన డిజిటల్ ఎక్స్ రే ద్వారా 80 మందికి పరీక్షలు నిర్వహించామని, 25 మంది నుండి కళ్ళే సేకరించి పరీక్షల కోసం సూర్యాపేట జిల్లా కేంద్రం లాబరేటరికి పంపించామన్నారు. 20 మందికి చిరు వ్యాధులకు మాత్రలు పంపిణీ చేశామని తెలిపారు. క్షయ వ్యాధి సోకిన వారికి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రభుత్వం నుండి ఉచితంగా ఆరు నెలలు న్యూట్రిషన్ ఫుడ్ బిస్కెట్స్ అందించామన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో 14 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో టీబీ సూపర్వైజర్ కిరణ్ కుమార్, జిల్లా టిబీ కోఆర్డినేటర్ ప్రసాద్, డిఈఓ మాధవరెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ ఫణిందర్, ఏఎన్ఎంలు లలిత, నాగమణి, గ్రామపంచాయతీ సెక్రటరీ సైదులు, ఆశ వర్కర్లు మరియమ్మ, నాగమణి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
