

వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎఎస్పీ చిత్తరంజన్
జనం న్యూస్ జులై 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు, మాదకద్రవ్యాల వ్యసన నివారణపై అవగాహన కల్పించేందుకు రెబ్బెన మండలం, గోలేటి సింగరేణి పాఠశాల మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ ఏఎస్పి చిత్తరంజన్ ప్రారంభించారు. ఆయన రెబ్బెన మండల యువత మరియు క్రీడాకారులకు గంజాయి, డ్రగ్స్ వాడక దుష్ప్రభావాలు, న్యాయపరమైన ఫలితాలు (NDPS చట్టంలోని సెక్షన్లు) గురించి స్పష్టంగా వివరించారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడల ద్వారా మానసిక శారీరక అభివృద్ధి ఉంటుందని సూచించారు. క్రీడల వల్ల ఏకత్వం, క్రీడా స్ఫూర్తి, సానుకూల దృక్పథం ఏర్పడుతుందని అన్నారు. ఈ టోర్నమెంట్ నందు మొత్తం 16 టీమ్స్ పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమంలో రెబ్బెన సీఐ బుద్దే స్వామి , ఎస్‌ఐ డి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. పోలీసులు ఇటువంటి కార్యక్రమాల ద్వారా మాదకద్రవ్యాలపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు.
