Listen to this article

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

బిచ్కుంద జులై 19 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ మరియు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పాల్గొని లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే గొప్ప సంకల్పంతో ప్రజా ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిందని తెలిపారు.. కొత్త రేషన్ కార్డుల కోసం పేదవాడి పదేళ్ల ఎదురు చూపులు నేడు ప్రజా ప్రభుత్వంలో ఫలించాయని అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి, 3.10 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించామని చెప్పారు. ఒక్కొక్కరికి ఆరు కేజీల ఉచిత సన్నబియ్యం అందిస్తుండడంతో పేదలందరూ కడుపు నిండా అన్నం తింటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇదీ పేదల సంక్షేమం పట్ల ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకపోగా, ఉన్న రేషన్ కార్డులను తొలగించడంతో పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. రేషన్ కార్డు అంటే ఆహార భద్రతే కాదు, అది పేదవాడి ఆత్మ గౌరవమని నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసి, సన్నబియ్యం అందిస్తూ ప్రజా ప్రభుత్వం పేదవాడి ఆత్మగౌరవాన్ని మరింత పెంచిందని హర్షం వ్యక్తం చేశారు..
అర్హత కలిగి ఉండి ఇంకా రేషన్ కార్డులు రాని వారు ఎవరైనా ఉన్నా, రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని ఇంతటితో ఆగిపోలేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి, బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్, మద్దూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్, జుక్కల్ తాసిల్దార్ మారుతి, డెలికేట్ విట్టల్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేషన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు