

జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో ఆర్మడ్ రిజర్వు విభాగంలో కానిస్టేబులుగా పని చేస్తూ, అనారోగ్యంతో విధులు నిర్వహించలేని కారణంతో ఉద్యోగ విరమణ చేసిన సిహెచ్.ఈశ్వరరావు కుమారుడు సిహెచ్.తేజను జూనియర్ సహాయకులుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూలై 26న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – విధి నిర్వహణలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పోలీసు కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, వారి కుటుంబంలోని వ్యక్తికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేసామన్నారు. నూతనంగా ఉద్యోగం పొందిన సిహెచ్.తేజను జిల్లా ఎస్పీ అభినందించారు. పోలీసుశాఖలో నీతి నిజాయితీ, క్రమశిక్షణతో పని చేయాలని, పోలీసు వ్యవస్థకు మంచి పేరును తీసుకొని రావాలన్నారు. విధుల్లో తక్షణమే జాయిన్ అవ్వాలని, నిర్వర్తించాల్సిన విధుల గురించి సీనియర్స్ ద్వారా తెలుసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఆర్మడ్ రిజర్వు విభాగంలో కానిస్టేబులుగా పని చేసిన సిహెచ్.ఈశ్వరరావు అనారోగ్యంతో విధులు నిర్వహించలేని కారణంగా ప్రభుత్వ అనుమతితో ఉద్యోగ విరమణ చేసి, అనంతరం మరణించారన్నారు. వారి కుటుంబానికి అండగా నిలవాలని, వారి కుటుంబంలో కుమారుడు సిహెచ్.తేజను జూనియర్ సహాయకులుగా నియమిస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, డిపిఒ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, జూనియర్ సహాయకులు చాముండేశ్వరి, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.