

జనం న్యూస్ జూలై 27
కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని వాటిని సద్వినియోగంచేసుకొని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు అధ్యక్షతన కాటేనికోన మండల పరిధిలోని ఉన్న 27 మత్స్యకార సంఘా సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన దాట్ల మాట్లాడుతూ మత్స్యకారులు ఐకమత్యంగా ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెంది ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని జీవన ప్రమాణాలను పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. బోట్లు రిజిస్ట్రేషన్ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని దాని ద్వారా మత్స్యకారులకు రావలసిన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని మత్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మత్స్యకార గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అభివృద్ధి అధికారి పి శ్రీనివాసరావు, మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.బి వర్ధన్, మండల మత్స్యశాఖ అధికారి వి రమణ రావు, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ పి కోటేశ్వరరావు మత్స్యకార నాయకులు సంఘాని వెంకటేష్, మత్స్యకార సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
