Listen to this article

స్నేహం ఎంతో అందమైనది. అపురూపమైనది.విలువైనది. వెలకట్టలేనిది.దానికి మించిన సంపద లేదు.స్నేహానికి మించిన అదృష్టం లేదు. స్నేహానికి

జనం న్యూస్ ఆగష్టు 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

స్నేహం ఎంతో అందమైనది. అపురూపమైనది. విలువైనది. వెలకట్టలేనిది. దానికి మించిన సంపద లేదు. స్నేహానికి మించిన అదృష్టం లేదు. స్నేహానికి సరిహద్దులు లేవు. పరిమితులూ లేవు. స్నేహానికి వయోబేధం లేదు. హోదా, అధికారమూ అడ్డు కావు. మంచి స్నేహితుడు తోడుగా ఉంటే ఆ ధీమా, భరోసాయే వేరు. ఇద్దరు వ్యక్తులకు, రెండు మనసులకు సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తరగని తీపి జ్ఞాపకం పంచుతుంది. కాలమాన పరిస్థితులకు అతీతమైన ఈ మైత్రీ మధురిమ అంతులేని ఆనందాన్ని పంచుతుంది.కన్నవారితో, కట్టుకున్నవారితో, తోబుట్టినవారితో సైతం చెప్పుకోలేని విషయాలను స్నేహితులతో చెప్పుకోవడం స్నేహ గొప్పదనం. కష్టసుఖాలలో, కలిమిలేమిలో తోడుగా అండగా ఉండేవారు, నిస్వార్థంగా సహాయం అందించేవారే నిజమైన స్నేహితులు. మానవ సమాజంలో పరస్పర ప్రేమానురాగాలు వెల్లివిరియాలంటే ప్రతి ఒక్కరూ స్నేహ ధర్మాన్ని నిర్వర్తించాలి. స్నేహ సౌభ్రాతృత్వాలే మంచి సమాజానికి పునాదిరాళ్లు.స్వార్థం, స్వలాభం కోసం స్నేహాన్ని కవచంగా వాడుకునే నీచ స్వభావులకూ కొరత లేదు. అవసరం మేరకు స్నేహం, ప్రేమ నటిస్తూ, అవసరం తీరాక ముఖం చాటేసే మహానుభావులూ ఉన్నారు. నిజానికి, స్నేహానికి మించిన సంపదగానీ, సత్కార్యంగానీ మరొకటి లేదు. ఇతరులను ప్రేమించలేనివారికి, స్నేహితులు లేనివారికి జీవితంలో ఎన్ని ఉన్నా నిరుపయోగమే. స్నేహ ధర్మాన్ని పాటిస్తేనే ఇహమైనా, పరమైనా దైవం మనందరికీ మంచి స్నేహితులను, సద్బుద్ధిని ప్రసాదించాలని, పరస్పర స్నేహ సంబంధాలలో వృద్ధిని,శుభాన్ని కలుగజేయాలని కోరుకుందాం.