 
									 
వైయస్ఆర్‌సీపీ యువనేత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి ఫైర్..!!
ఒంగోలు ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్):
తాడేపల్లి: అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు మరోసారి రైతులకు దగా, పచ్చిమోసం చేశారని వైయస్ఆర్ సీపీ యువ నాయకులు, ఏపీ స్టేట్ వైసీపీ యూత్ విభాగం సెక్రటరీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నాడు ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం రాష్ట్రంలో 69.26% మంది రైతుల సరాసరి భూమి ఒక ఎకరం. ఆ తరువాత 19.31% మంది రైతుల సరాసరి భూమి 3.5 ఎకరాలు. అంటే రాష్ట్రంలో 88.57% మంది రైతులు సన్న, చిన్న కారు రైతులు. సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం ఆ రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, చాలా నష్టపోతుండడంతో వారిని ఆదుకునేందుకు, తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని 2017లో జరిగిన పార్టీ ప్లీనరీలో వైయస్ జగన్ ప్రకటించారు. ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ఆర్ రైతు భరోసా’ పేరుతో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు ఇస్తామని పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినా.. అంత కంటే ఎక్కువే ఇచ్చారు. ఏటా రూ.12,500 కు బదులు రూ.13,500 చొప్పున, నాలుగేళ్లు కాకుండా 5 ఏళ్లు మొత్తం రూ.67,500 చొప్పున సాయం చేశారు. ఆ మేరకు 5 ఏళ్లలో రైతు భరోసా కింద 53.58 లక్షల రైతులకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం చేశారు. తొలి ఏడాది దగా, రెండో ఏడాది మోసం.. రైతులకు వైయస్ జగన్ కేవలం రూ.13,500 మాత్రమే ఇస్తే, అంత కంటే ఎక్కువగా తాము, కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబుతో పాటు, కూటమి నేతలు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చి, కేంద్రం ఇచ్చే దాంతో కలిపి ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున మాత్రమే సాయం చేస్తామని చెప్పారు. అక్కడా మళ్లీ దగా. తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టారు. నిస్పిగ్గుగా మాట తప్పారు ఇప్పుడు రెండో ఏడాది కూడా ఖరీఫ్ మొదలై రెండు నెలలు దాటిన తరువాత ఆగష్టు నెలలో, కేవలం రూ.5 వేల చొప్పున మాత్రమే (కేంద్రం ఇస్తున్న రూ.2 వేలు కలిపి రూ.7వేలు), అది కూడా పలు నిబంధనలు విధించి, రైతుల సంఖ్యను కుదించి, 46,85,838 మంది ఖాతాల్లో రూ.2,342 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. అలా దాదాపు 7 లక్షల రైతులకు ఎగ్గొట్టారు. పైగా ఈ ఏడాది ఇంకా ఇవ్వాల్సిన సాయం షెడ్యూల్ కూడా ప్రకటించలేదు. 2014 ఎన్నికల్లో కూడా, అప్పటికి రైతులకు ఉన్న వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక నిస్పిగ్గుగా మాట తప్పారు. రకరకాల కారణాలు చెప్పి, ఏవేవో కమిటీలను నియమించి కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి, రైతులను పచ్చిగా మోసం చేశారు. మళ్లీ ఇప్పుడు కూడా అన్నదాతా సుఖీభవలో రైతులకు దగా చేస్తున్నారు. నిజానికి ఎవ్వరినీ మోసం చెయ్యనిది, అలా చేసే ఆలోచన కూడా లేనిది ఒక్క రైతుకు మాత్రమే. తాను నష్ట పోతూ, తన కుటుంబానికి ఆర్ధిక భద్రత ఇవ్వలేకున్నా పది మందికి ఆహారాన్నందిస్తున్నాను అన్న సంతృప్తితో బ్రతికే రైతులను కూడా చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారు.


