

జనం న్యూస్, ఆగస్టు పశ్చిమ గోదావారి జిల్లా ఒకరోజు ముందుగా శనివారం నాడు స్నేహితుల దినోత్సవమును ఎంతో ఆనందోత్సాహాలత పెనుగొండ భాష్యం పాఠశాల లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా స్నేహం యొక్క గొప్పతనాన్ని స్నేహితుల బాధ్యతను తెలియజేసే ఆటపాటలతో ఆడి-పాడి అందరినీ అలరించారు. విద్యార్థులంతా ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఫ్రెండ్షిప్ బ్యాండ్లను ఒకరికొకరు కట్టుకుని, మిఠాయిలను పంచుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ ఎన్ వి అప్పారావు మాట్లాడుతూ, స్నేహం యొక్క గొప్పతనం అనంతం. ఈ విశ్వంలో కన్నవారి తరువాత అంత ఆత్మీయతను పంచేది స్నేహం మాత్రమే. ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం స్నేహం. మంచి స్నేహితులు గా ఉండడం-మంచి స్నేహితులను పొందడం రెండూ కూడా ఎంతో గొప్పవి. తల్లి,తండ్రి, తోడపుట్టిన వారు,బంధువులు అందర్నీ ఆ భగవంతుడే ఇస్తాడు కానీ స్నేహితులను మాత్రం మనమే నిర్ణయించుకోవాలి. కాబట్టి స్నేహితులని ఎంచుకునేటప్పుడు మంచి స్నేహాలను ఎంచుకోవాలని, కలకాలం ఆ స్నేహాలు నిలవాలని అన్నారు. స్నేహానికి నమ్మకం ఎంతో అవసరం. స్నేహితులు ఒకరికొకరు కష్టంలో సుఖంలో చేదోడు వాదోడుగా ఉండాలని, సమస్యలు వచ్చినప్పుడు ధైర్యాన్నిస్తూ ఓదార్పుగా ఉండాలని, తప్పటడుగు వేస్తున్న మిత్రుడిని మందలిస్తూ సరైన మార్గంలో నడపాలని, స్నేహితుడి మనసెరిగి కష్టకాలంలో తాను చెప్పకపోయినా తెలుసుకుని అండగా నిలబడాలని చెబుతూ విద్యార్థులకు స్నేహ ధర్మాలను వివరించారు. స్నేహం ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన అనుభూతిని ఇస్తుంది.ఆటపాటలాడే వయసులో మొగ్గలా ప్రారంభమై మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తున్నటువంటి ఈ స్నేహాలు కొందరిని అత్యున్నత స్థాయికి చేరిస్తే మరికొందరిని అధఃపాతాళానికి నెట్టేస్తాయి. తమ అవసరాలకో స్వార్థంకో స్నేహితులను ఉపయోగించకూడదు అని అటువంటి స్నేహాలే కావని తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కొంత సమయాన్ని గడిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం జోనల్ ఇంచార్జ్ ఏ శ్రీరామన రెడ్డి, ఇంచార్జ్ రాణి రోజాజీ, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.