Listen to this article

విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత

జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కీ॥శే॥లు బళ్ళారి రాఘవ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 2న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ పి. సౌమ్యలత ముఖ్య అతిధిగా హాజరై, కీ॥శే॥లు బళ్ళారి రాఘవ గారి చిత్ర పటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మాట్లాడుతూ – కీ.శే.లు బళ్ళారి రాఘవ గారు తెలుగు కళా రంగానికి విశేషమైన సేవలందించారన్నారు. నాటక రచనలతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులను బళ్ళారి రాఘవ తీసుకొచ్చారన్నారు. ఉపాధ్యాయునిగా, న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటరుగా, రాజకీయ నాయకునిగా విభిన్నమైన రంగాల్లో తన ప్రతిభను చాటుకొన్నారన్నారు. బ్రిటీషు ప్రభుత్వం బళ్ళారి రాఘవను “రావు బహద్దూర్” అని బిరుదునిచ్చిందన్నారు. పౌరాణిక నాటకాల్లో పద్యాల వినియోగం తారా స్థాయిలో పెరిగిందని, వీటిని తగ్గించి, నటనకు ప్రాధాన్యత కల్పించే విధంగా పాత్రలను తీర్చిదిద్దానలన్నారు. అంతేకాకుండా, నాటకాల్లో స్త్రీలను ప్రోత్సహించి నాటక రంగానికి, తద్వారా సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చారని అదనపు ఎస్పీ పి. సౌమ్యలత అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ సిఐ బి.సుధాకర్, ఆర్ఎస్ఐ ఎన్ .గోపాలనాయుడు, ఎఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు పర్యవేక్షకులు టి.రామకృష్ణ, వెంకటలక్ష్మి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.