Listen to this article

ప్రతీ చెల్లి గుండెలో, అన్న మనసులో పదిలంగా అల్లుకుపోయిన ప్రేమానురాగాల సంబురమే మన రాఖీ

కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ అన్నపై, చెల్లిపై ప్రేమను,అనుబంధాన్ని ప్రకటిస్తూ చేసుకునే పండగే రాఖీ

జనం న్యూస్ ఆగష్టు 09 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

‘‘ఉరుకులూ పరుగుల జీవితంలో.. బతుకు దెరువు ఆరాటంలో..ఏడ తానున్నాడో అన్న.. ఏ ఊరిలో ఉంటేనేం.. ఏ సిటీలో ఉంటేనేం.. ఏడాదికోసారి పోయి రాఖీ కట్టి రావాల్సిందే..నా కోసం నా అన్న ఎంత చేయలేదు.నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో.. ఎంతైనా అన్న అన్నే’’ రక్షా బంధన్ నేపథ్యంలో ప్రతీ చెల్లి మనసును తట్టిలేపుతున్న జ్ఞాపకాలివి. ‘‘తీరిక లేని జీవితాలు.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఎక్కడుంటేనేం.. రాఖీ పండుగకి మాత్రం మా చెల్లి తప్పక వస్తుంది.. అన్నంటే అంత ప్రేమ.. మొండి పిల్ల.. అత్త, భర్త వద్దన్నా వినదు అన్నకోసం పట్టు బట్టి వస్తుంది..’’ ప్రతీ అన్న గర్వంగా చెప్పుకునే మాటలివి. నిజమే కదూ.. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్‌లో ఏదో విడదీయలేని ఫీల్ ఉంది బ్రో..ప్రతీ చెల్లి గుండెలో, అన్న మనసులో పదిలంగా అల్లుకుపోయిన ప్రేమానురాగాల సంబురమే మన రాఖీ పండుగ. ఇదొక సంప్రదాయ పండుగగా పేర్కొంటారు. అయితే ఇప్పుడది కేవలం కొందరు మాత్రమే జరుపుకునే సాంప్రదాయమనే పరిధిని దాటింది. కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ అన్నపై, చెల్లిపై ప్రేమను, అనుబంధాన్ని ప్రకటిస్తూ జరుపుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు ఉద్దేశం అన్నా చెల్లెళ్ల అనుబంధమే. అందుకే ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అన్నకోసం వచ్చి రాఖీ కడుతుంది చెల్లి. అన్ని పనులూ, ప్రయాణాలు, ఆఫీసులూ మానుకొని చెల్లి కోసం ఎదురు చూస్తుంటాడు అన్న. అదే రాఖీ పండుగ అసలు ఉద్దేశం అంటారు పెద్దలు.అన్నా చెల్లెళ్ల ప్రేమాను బంధాలు జీవితాంతం కొనసాగాలి. పరస్పర ప్రేమతో, పరస్పర గౌరవంతో అన్నా చెల్లెళ్లు కలకాలం సంతోషంగా వర్ధిల్లాలి.