

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకొని, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా ఆగస్టు మాసంలో డ్రంకన్ డ్రైవ్, ఓవర్ స్పీడు, హెల్మెట్ ధారణ మరియు బ్లాక్ స్పాట్స్ వద్ద ఎన్ఫోర్సుమెంటు కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆగస్టు 8న ఆదేశించారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రతకు ఆగస్టు మాసంలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాలైన డ్రంకన్ డ్రైవ్, ఓవర్ స్పీడు, హెల్మెట్ ధరించడం ఉల్లంఘించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, వారిపై కేసులు నమోదు చేయడం, ఈ-చలానాలను విధించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎస్ఐ నుండి పైస్థాయి పోలీసు అధికారులు జిల్లాలో ప్రతీ రోజూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, నమోదు చేసిన కేసులు వివరాలను జిల్లా కేంద్రానికి తెలియజేయాలని ఆదేశించామన్నారు. ఆగస్టు మాసంలో ఒక్కొక్క వారం రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాలైన ఒక్కొక్క అంశంపై దృష్టి పెట్టి, ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా డ్రంకన్ డ్రైవ్, అతి వేగం, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ జిల్లాలో ఇప్పటికే ప్రారంభించామన్నారు. మద్యం సేవించి వాహనాలను నడిపిన వాహనదారులను ఉపేక్షించవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అతివేగంతో వాహనాలను నడిపి ఇతర వాహన
దారులకు లేదా ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసే వాహనదారులపై కఠినంగా వ్యవహరించి, కేసులు నమోదు చేయాలన్నారు. అదే విధంగా హెల్మెట్ ధరించడం వలన కలిగి ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. జిల్లాలో ప్రమాదాలు తరుచూ జరుగుతున్నట్లుగా గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద రహదారికి ఇరువైపులా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరుగుటకుగల కారణాలను గుర్తించి, ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. వాహనాల వేగాన్నినియంత్రించేందుకు బ్లాక్ స్పాట్స్ వద్ద స్పీడు బ్రాకర్లను, స్టావర్లును ఏర్పాటు చేయాలని, సంబంధిత విభాగాల అధికారులతో మాట్లాడి లైటింగు, అవసరమైతే ఇంజనీరింగు మార్పులు చేయడం, మొక్కలను తొలగించడం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.