Listen to this article

వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలి

వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు

ఎస్సై ప్రవీణ్ కుమార్ మునగాల మండలం

జనం న్యూస్ ఆగష్టు 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో మునగాల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక పత్రిక ప్రకటనలో మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ,రాబోయే మూడు రోజులు వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరద నీరు ఇంట్లోకి చొరబడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాతావరణ హెచ్చరికలను నిరంతరం పరిశీలిస్తూ, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని కోరారు.ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే 100 నెంబర్ కు కాల్ చేయాలని ఎస్సై తెలిపారు. పాడుబడిన లేదా కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఉండేవారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.ఇంటికి లేదా పనికి వెళ్లే తొందరలో వరద ప్రవాహాలను దాటే ప్రయత్నం చేసి విలువైన ప్రాణాలను కోల్పోవద్దని చెప్పారు. గ్రామాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మండల ప్రజలకు సూచించారు.