

సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి
(జనంన్యూస్.18 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున గౌడ సంఘాల నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట యోధుడు . అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ ఎంతో ప్రశంసనీయమైనదని కొనియాడారు. దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న మహరాజ్ అని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. , రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసామాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి మొఘల్ రాజుల దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను పాపన్న గౌడ్ అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల వృత్తిదారులు పాల్గొన్నారు.