

బిచ్కుంద ఆగస్ట్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరగడంతో దాదాపు 656 గొర్రెలు మరియు నలుగురు కాపరులు వాగులో చిక్కుకుపోయారు..
విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ డి.ఎస్.పి .ఎస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్వయంగా పాల్గొని బోటులో ప్రయాణించి పరిస్థితిని పరిశీలించారు. ఎమ్మెల్యే చొరవతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టిన బృందాలు తీవ్రంగా శ్రమించి వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరులను, గొర్రెలను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు.. ఊహించని పరిణామంతో వరద గుప్పిట్లో చిక్కుకొని ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటున్న గొర్రెల కాపరులను మరియు వారి గొర్లను కాపాడటంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు , సహాయక బృందాలకు కాపరులు, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలలో తానే స్వయంగా పాల్గొనడం పట్ల జుక్కల్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు ఉండడం వల్ల అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచించారు.. ఏదైనా సహాయం కావాల్సి వస్తే తనను సంప్రదించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తో పాటు తాసిల్దార్ వేణుగోపాల్ సిఐ రవికుమార్ ఎస్సై మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

