Listen to this article

రిసెప్షన్ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

జనం న్యూస్,ఆగస్టు 19,

రాంబిల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా పరవాడ సబ్ డివిజన్ , రాంబిల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సందర్శించారు.ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన రిసెప్షన్ మరియు కౌన్సిలింగ్ సెంటర్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ సిబ్బంది ఫిర్యాదారులకు సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా సహకరించాలని, మహిళలు, బాల బాలికలపై జరిగే నేరాలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని,సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఎటువంటి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు.పారిశ్రామిక ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాలు పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలి. ప్రధాన కూడళ్ళు, వ్యాపార సముదాయాల మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల వద్ద, ప్రజల యొక్క సహకారంతో తప్పక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని,రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా పటిష్టంగా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.తీవ్రమైన కేసుల సీడీ ఫైల్స్ ను పరిశీలించి, ఆయా కేసుల పురోగతిని తెలుసుకుని తగు సూచనలు ఇచ్చారు. స్టేషను ప్రాంగణంలో గల వాహనాలు ఏ కేసుల్లో సీజ్ చేసినవి, ఎందుకు స్టేషను ప్రాంగణంలో ఉన్నవి అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీజ్ చేసిన వాహనాలకు ఆయా కేసుల వివరాలను ట్యాగ్ చేయాలన్నారు. విచారణ ఇంకా పూర్తికాని కేసులలో విచారణను వేగవంతం చేయాలని, ఛార్జ్ షీట్ త్వరితగతిన వేసి కోర్టు అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన ట్రైల్స్ కి వచ్చేలా చేయాలని అధికారులకు ప్రత్యేకంగా సూచించారు.రౌడీ షీటర్స్ మరియు చెడునడత కలిగిన వ్యక్తుల వివరాలు తెలుసుకుని, ప్రస్తుతం వారు జీవనోపాధికి ఏమేమి పనులు చేస్తున్నారో ఆరా తీశారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దొంగతనాలు మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించేందుకు పగలు, రాత్రి గస్తీలను పునర్వ్యవస్థీకరించి నేరాలు నివారించేందుకు పటిష్ట గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు మరియు సమస్యలు గూర్చి ఆరా తీశారు. జి.ఎం.ఎస్.కే లు అనుసంధానంతో సమస్యాత్మక ప్రాంతాలు మరియు వార్డులలో తరచూ సందర్శించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీలు నిర్వహించిన సమయంలో పరవాడ సబ్ డివిజన్ డిఎస్పీ విష్ణు స్వరూప్,రాంబిల్లి సీఐ సిహెచ్.నర్సింగరావు, ఎస్సై డి.నాగేంద్ర మరియు సిబ్బంది తదితరులు ఉన్నారు.