విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రత, ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్, హైవేలపై, ముఖ్య కూడళ్ళు వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టి ‘ఓవర్ స్పీడ్’ తో వెళ్ళే వాహనాలపై కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆగష్టు 19న తెలిపారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రతకు జిల్లా వ్యాప్తంగా ఆగష్టు 11 నుండి 17 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా అతివేగంతో వెళ్ళే వాహనాలపై 23 కేసులు నమోదు చేసి, ఈ- చలానాగా రూ.25,665/- లను విధించామన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషను పరిధిలోని బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టామన్నారు. వాహనదారులకు అతివేగంతో వాహనాలు నడపడం వలన కలిగే అనర్ధాలను సంబంధిత అధికార్లు వాహనదారులకు వివరిస్తూ, కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలని,తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్స్ ధరించాలన్నారు. ప్రతీ వాహనదారుడు భద్రత ప్రమాణాలను పాటిస్తూ,సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలన్నారు. రహదారి భద్రత నియమాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని వాహనదారులను జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అతివేగంతో వాహనాలు నడపడం వలన ప్రమాదాలకు గురై, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న వాస్తవాన్ని ప్రతీ వాహనదారుడు గుర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ను విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యా రెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించారన్నారు.


