

జనం న్యూస్,ఆగస్టు21,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలం పూడిమడకలో చేపలు మృత్యువాత పడిన ఉప్పుటేరుని ఆంద్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు,ఏపీఐఐసి అధికారులు, ఉత్తరాంధ్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ సుందరపు సతీష్ కుమార్ లతో కలిసి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సందర్శించారు.గత మూడు రోజుల నుంచి అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో గల ఉప్పుటేరులో పరిశ్రమల వ్యర్ధాలు కలిపేస్తుండటం వలన మత్స్య సంపద మృత్యువాత పడుతుందంటున్న మత్య్సకారుల ఆరోపణల దృష్ట్యా గురువారం ఎమ్మెల్యే సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ చేపలు చనిపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకుని, పరిశ్రమల వ్యర్ధాలపై కూడా ఆరా తీశారు.ఉప్పుటేరులో ఉన్న నీటిని పరీక్షలు పంపించి,నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.అనంతరం మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉప్పుటేరులో ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలని ఎపిఐఐసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
