జనం న్యూస్ తర్లుపాడు మండలం ఆగష్టు 23
రైతులు సాగులో నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పొలంబడి కార్యక్రమం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి వివరించారు. ఆరోగ్యవంతమైన పైరను పెంచడం, మిత్ర పురుగులను సంరక్షించుకోవడం, సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడును సాధించటం పొలంబడి లక్ష్యమన్నారు. మండలంలోని చెన్నారెడ్డి పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం గ్రామసభ నిర్వహించారు. పొలం బడిలో రైతులకు పంట విత్తిన దగ్గర నుండి పంట కోసే వరకు 14 వారాల శిక్షణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. మట్టి నమూనాల సేకరణ, విత్తన శుద్ధి , విత్తన మొలకశాతం పరీక్ష,నీటి సామర్థ్యం పై ప్రయోగాలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. రైతులకు మట్టి నమూనాల సేకరణ మరియు విత్తన శుద్ధి అనే అంశాలను ప్రదర్శన చేసి చూపించారు. పొలంబడి కార్యక్రమంలో ఏఈఓ దేవేంద్ర , వి ఏ ఏ అరవింద్ కుమార్, చెన్నారెడ్డిపల్లి రైతులు పాల్గొన్నారు.



