Listen to this article

భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్, ఆగస్టు 23 ( జనం న్యూస్)

కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయమని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నేతలు లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు.మండల అధ్యక్షుడు మాలోత్ గాంధీ నాయక్, మాజీ జిల్లా అధ్యక్షుడు జీవీకే మనోహర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు: ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి. అర్హులైన అందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలి. మండలంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడాలి. పోడు భూములకు పట్టాలను వెంటనే జారీ చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నాయకుడు జీవీకే మనోహర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ముఖ్యంగా రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లలో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఈ ప్రాంతానికి న్యాయం జరగకపోవడం దురదృష్టకరమని అన్నారు. పోడుపట్టాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు వాగ్దానాలు మరిచిపోతున్నారని విమర్శించారు.ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు మోసపోవకుండా ఆలోచించి ఓటు వేయాలని, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలతో పాటు నిలబడి వారి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జల్లారపు శ్రీనివాస్, యమునోరి శివ, మాడ కృష్ణారెడ్డి, గుంపుల మహేష్, కళ్యాణ్, వెంకన్న, వీరేశం, చిన్న తదితరులు పాల్గొన్నారు.