Listen to this article

జనంన్యూస్. 28.నిజామాబాదు. రూరల్.

ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సందర్శించారు. వరద నీటి ఉద్ధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో ధర్పల్లి మండలం వాడి గ్రామంతో పాటు నడిమి తండా, బీరప్ప తండాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీ.పీతో కలిసి వాడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యేతో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు, కూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉద్ధృతి తీవ్రతను అంచనా వేశారు. ఇళ్లలోకి వచ్చి చేరిన వరద జలాలతో వాటిల్లిన నష్టం గురించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన ఒన్నాజిపేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే, కలెక్టర్ భరోసా కల్పించారు. వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, రక్షిత మంచి నీరు అందుబాటులో ఉంచామని అన్నారు. కాగా, విద్యుత్, తాగునీటి వసతి వంటి సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున మళ్లీ వరద వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొనేలా, ప్రజలకు సహాయక చర్యలు అందించేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని ఎస్.డీ.ఆర్.ఎఫ్. బృందాలకు, పోలీసులకు సూచించారు. కాగా, వాడి గ్రామాన్ని సందర్శించడానికి ముందు, రామడుగు, లోలం గ్రామాల వద్ద లో లెవెల్ వంతెన పై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని కలెక్టర్, సీపీ లు పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఈ మార్గాల మీదుగా రాకపోకలను నిలిపి వేయించారు. వీరి వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఇతర అధికారులుఉన్నారు.