

తనిఖీ వివరాలు విధిగా స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ లో నమోదు చేయాలి
చదువులో వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
జనం న్యూస్ ఆగస్ట్ 28
సంగారెడ్డి జిల్లా మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రెగ్యులర్ గా తమ పరిధిలోని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యలో కొనసాగుతున్న వివిధ రకాల కార్యక్రమాలపై విషయాల వారీగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రెగ్యులర్ గా పాఠశాలలను సందర్శించి అక్కడ కొనసాగుతున్న కార్యక్రమాలను స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ నందు విధిగా అప్లోడ్ చేయవలసిందిగా ఆదేశించారు.ముఖ గుర్తింపు హాజరులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలు ప్రత్యేకించి కరెంటు సదుపాయం, మరుగుదొడ్లు, తాగునీరు తదితర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పాఠశాలలలో విద్యార్థుల వాస్తవిక నమోదు, డైస్ డాటా మధ్య వ్యత్యాసము ఉండకూడదు అని సూచించడం జరిగింది.విద్యార్థుల ఆధార్ నమోదు మరియు ఆన్లైన్ డేటా ఎంట్రీ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.పాఠశాలలో కొనసాగుతున్న ఎఫ్ఎల్ఎన్ ,ఎల్ఐపి లో నిర్దేశించిన కార్యక్రమాలను సమయసారిని ప్రకారం పూర్తిచేయాలని, వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కృత్రిమ మేధా ఆధారిత విద్యాబోధనను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిల్లలకు అట్టి విషయాలలో సందేహాలను నివృత్తి చేస్తూ అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించుకునేలా చూడాలన్నారు. 59 పూర్వ ప్రాథమిక పాఠశాలల మంజూరు ను దృష్టిలో ఉంచుకొని అన్ని పాఠశాలలలో ఆ విద్యార్థులకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలలో అందరు విద్యార్థులకు గుడ్డు పంపిణీ చేసేలా ప్రధాన ఉపాధ్యాయులు చూసుకోవాలని ఆదేశించారు.ఇన్స్పైర్ మానక్ నామినేషన్ కు సంబంధించి జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే వారి విద్యార్థులచే నామినేషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు.స్వచ్ఛ హరిత విద్యాలయ పురస్కార్ 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు సెప్టెంబర్ 15 లోగా స్వచ్ఛ హరిత విద్యాలయ పురస్కారానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. మన జిల్లా నుండి ఎక్కువ పాఠశాలలు రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందేలా ప్రధాన ఉపాధ్యాయులు వారి వారి పాఠశాలలను నమోదు చేసుకోవాలి.జిల్లాలోని అన్ని పాఠశాలలలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల సమావేశాలు ప్రతినెలా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఎక్కువమంది తల్లిదండ్రులను సమావేశాలలో భాగస్వాములు చేసేలా తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఈ సమావేశంలో పాఠశాల పరిస్థితులు, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు, వారి ప్రగతి ప్రదర్శన జరగాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్ , జిల్లా విద్యాధికారి ,యస్ వెంకటేశ్వర్లు , సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు బాలయ్య వెంకటేశం తాజుద్దీన్ సుప్రియ, అన్ని మండలాల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
